25 వేల మంది రైతులకు రుణమాఫీ

Runamafi for  25 thousand farmers - Sakshi

గతంలో నోచుకోని రైతులకు వర్తింపజేస్తూ సర్కారు ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా గతంలో రుణమాఫీకి నోచుకోని అర్హులైన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం రద్దు కావడంతో ఉత్తర్వు లను బయటకు వెల్లడించకుండా.. అంతర్గతంగా మాత్రమే ఆదేశాలు జారీ చేశారు.

దీంతో 25 వేల మందికిపైగా రైతులకు రూ.160 కోట్ల మేర రుణమాఫీ కానున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలి పాయి. సర్కారు రద్దుకు ముందే వ్యవసాయ శాఖ సంబంధిత ఫైలును సీఎం కేసీఆర్‌ ఆమోదానికి పంపిన సంగతి తెలిసిందే. అయితే సీఎం సంతకం చేసినా ఉత్తర్వులు వెలువడటానికి ఇన్నాళ్లు పట్టిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్ష రూపాయల్లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేసిన సంగతి తెలిసిందే.

సుమారు 35.33 లక్షల మంది రైతుల రుణమాఫీ కోసం రూ. 16,124 కోట్లను బ్యాంకులకు చెల్లించింది. రుణమాఫీ అర్హులను గుర్తించే క్రమంలో బ్యాంకులు కొందరు రైతుల వివరాల జాబితాను సర్కారుకు పంపించలేదు. దీంతో 25 వేల మందికి పైగా రైతులు అర్హులై ఉండి రుణమాఫీకి నోచుకోలేకపోయారు. ఈ క్రమంలో అర్హులైన రైతులు ఉన్నందున మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వీరికి రుణ మాఫీ చేయాలని కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలోనూ దీనిపై పలుమార్లు చర్చ జరిగింది. కానీ వీరికి రుణమాఫీ అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top