రూ. 400 కోట్ల పీఎఫ్‌.. ఉఫ్‌!

RTC workers Provident Fund has been diverted by management - Sakshi

ఆర్టీసీ కార్మికుల భవిష్యనిధి మింగేసిన యాజమాన్యం

నిబంధనలకు విరుద్ధంగా పక్కదారి

2016 జూన్‌ నుంచి గుటుక్కు

తొలుత సంస్థ వాటా.. ఆ తర్వాత కార్మికుల వాటా మాయం

సమన్లు జారీ చేసిన భవిష్యనిధి కార్యాలయం

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణరోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ ఆర్టీసీ) మళ్లీ దారి తప్పింది. కార్మికుల వేతనాల నుంచి మినహాయించి వారి భావి అవసరాలకు వినియోగించాల్సిన భవిష్య నిధి (పీఎఫ్‌)ని స్వాహా చేసింది. ఆ నిధికి సంస్థపరంగా చెల్లించాల్సిన వాటాతోపాటు స్వయంగా కార్మికుల వేతనాల నుంచి మినహాయించిన మొత్తాన్ని కూడా వాడేసుకుంది. ఇప్పుడు ఈ అంశం పెద్ద వివాదంగా మారింది. గతంలో ఇదే తరహా తప్పిదంతో భవిష్య నిధి కమిషనర్‌ ఆగ్రహానికి గురైన సంస్థ మరోసారి ఆ కమిషనర్‌ నుంచి సమన్లు అందుకోవాల్సి వచ్చింది.

పీఎఫ్‌ సొమ్ముపై కన్ను...
ఆర్టీసీకి ఇటీవల 35 డిపోల్లో లాభాలు మొదలయ్యాయి. తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి ఆర్టీసీ లాభాల రుచి చూసింది. దీంతో మిగతా డిపోలను కూడా లాభాల జాబితాలోకి తెచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. కానీ కొండలా పేరుకుపోయిన అప్పు, దానికి ప్రతినెలా చెల్లించాల్సిన వడ్డీ, ఆర్టీసీ వేతన సవరణ తర్వాత భారీగా పెరిగిన వేతనాల భారం, డొక్కు బస్సులు పెరగటంతో తడిసిమోపెడవుతున్న వాటి నిర్వహణ వ్యయం... ఇలా ఖర్చుల పద్దు లాభాలను మింగేస్తున్నాయి. దీంతో నిర్వహణ కోసం దిక్కులు చూస్తున్న ఆర్టీసీ కన్ను కార్మికుల భవిష్య నిధిపై పడింది.

ఏడాదిన్నర కిందట నుంచి...
ప్రతి నెలా కార్మికుల వేతనాల నుంచి ఆర్టీసీ దాదాపు రూ. 13 కోట్ల వరకు సంస్థ మినహాయించడంతోపాటు అంతే మొత్తాన్ని దానికి జత చేసి భవిష్య నిధి ట్రస్టులో జమ చేయాలి. అయితే ఆర్టీసీకి ఉన్న ప్రత్యేక వెసులుబాటు దృష్ట్యా ఆర్టీసీ అధీనంలోనే ఎండీ చైర్మన్‌గా ఉండే భవిష్యనిధి ట్రస్టులో జమ చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని ఇతర సంస్థలకు వడ్డీలకు ఇచ్చి తిరిగి ఆదాయాన్ని పొందే వెసులుబాటు ఉంది. కార్మికులకు అవసరమైన రుణాలను ఈ మొత్తం నుంచి ఇస్తారు. అయితే ఆర్టీసీ 2016 జూన్‌ నుంచి సంస్థ వాటా నిధులను ట్రస్టుకు జమ చేయకుండా సొంతానికి వాడుకోవటం మొదలుపెట్టింది. ఆ తర్వాత కార్మికుల వాటా నిధులనూ దారి మళ్లించటం మొదలుపెట్టింది. నాలుగు నెలలుగా ఆ తంతు జరుగుతోంది. విషయం భవిష్య నిధి కమిషనర్‌ దృష్టికి చేరడంతో ఆర్టీసీ యాజమాన్యానికి సమన్లు జారీ చేశారు. సొంతంగా ట్రస్టు ఏర్పాటు చేసుకొని అందులోనే పీఎఫ్‌ మొత్తాన్ని జమ చేసే వెసులుబాటును ఎందుకు రద్దు చేయకూడదని కూడా ప్రశ్నించినట్టు తెలిసింది.

సర్దుబాటు సమస్యే...
భవిష్య నిధి నుంచి ఆర్టీసీ వాడుకున్న రూ. 400 కోట్లను తిరిగి సర్దుబాటు చేయడం పెద్ద సమస్యగా మారనుంది. దాదాపు రెండున్నరేళ్ల క్రితం ఇదే తరహాలో రూ. 160 కోట్లను వాడేసుకోగా అందులో 25 శాతాన్ని చెలించి మిగతా దాన్ని సర్దుబాటు చేయడం ఇప్పటివరకు పూర్తిగా కుదరలేదు. ప్రభుత్వ సాయం లేకపోవడం, జీహెచ్‌ఎంసీ నిధులు ఇస్తామని చెప్పినా ఆ సంస్థ కాదనడంతో ఇప్పుడు ఆర్టీసీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దారి మళ్లించిన నిధుల్లో సంస్థ వాటా రూ. 335 కోట్లు ఉండగా కార్మికుల వేతనాల నుంచి మినహాయించిన మొత్తం రూ. 65 కోట్ల వరకు ఉన్నట్టు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top