దానికోసమే సోనియా గాంధీ వచ్చారు: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy Speech In Medchal Meeting - Sakshi

తెలంగాణ రైతులను, సమాజాన్ని ఆదుకునేందుకే సోనియా గాంధీ అడుగుపెట్టారు

మేడ్చల్‌ సభలో రేవంత్‌ రెడ్డి

సాక్షి, మేడ్చల్‌ : అమరుల కుటుంబాలను, తెలంగాణ సమాజాన్ని ఆదుకోవాడానికే యూపీఏ సోనియా గాంధీ తెలంగాణలో అడుగుపెట్టారని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మేడ్చల్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆరు దశాబ్దాల పోరాటాన్ని గుర్తించి, యువకులు ఆత్మబలిదాలు చేసుకోకూడదని నాడు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు.

కేసీఆర్‌ను ఓడిస్తే ఫాం హౌస్‌లో పడుకుంటారని.. కేటీఆర్‌ అమెరికా పారిపోతాడని.. గెలిచినా ఓడినా నిత్యం ప్రజల పక్షాన నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని రేవంత్‌ పేర్కొన్నారు. 2004లో రైతులకు రుణమాఫీ, రైతులకు ఉచిత విద్యుత్‌, పేదలకు ఇందిరమ్మ గృహాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని రేవంత్‌ అన్నారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ప్రకటించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, లక్ష ఉద్యోగాలు, దళితులకు మూడుఎకరాల భూమి ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. 

రుణం తీర్చుకునే సమయం వచ్చింది: మల్లు
తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో పురిటినొప్పులు పడిందని మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఎన్నో కష్టాలకు ఓర్చి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. సోనియా గాంధీ రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top