మోదీ చొరవతోనే అభినందన్‌ విడుదల: దత్తాత్రేయ

Release of Abhinandan with Modi initiative says Dattatreya - Sakshi

భారత దౌత్యంతో ఏకాకైన పాకిస్తాన్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ చొరవతోనే అభినందన్‌ విడుదలయ్యారని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. భారత దౌత్య నిర్ణయాలతో ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్‌ ఏకాకి అయ్యిందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..అభినందన్‌ భారత్‌కు తిరిగి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. భారత్‌ చేస్తున్న పోరాటం తీవ్రవాదులపైనేనని, పాక్‌పై యుద్ధం చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. పాక్‌ ఉగ్రవాద కేంద్రాలను నాశనం చేసే బాధ్యతను పాక్‌ తీసుకోవాలని, అప్పుడే శాంతి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. పుల్వామా దాడుల తర్వాత భారత వైమానిక దళాల విజయ పరంపర దేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందన్నారు. ఉగ్రవాదంపై పోరులో దేశ ప్రజలు, రాజకీయ పార్టీలు ఒకే తాటిపై ఉన్నాయనే సంకేతాలు ప్రపంచానికి స్పష్టమయ్యాయన్నారు.

బీజేపీకి 300 సీట్లు ఖాయం
మోదీ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు ఖాయమని దత్తాత్రేయ జోస్యం చెప్పారు. తెలంగాణలోని అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేసి గెలవబోతుందని, బలమైన అభ్యర్థులు పోటీలో ఉంటారన్నారు. ఎన్నికలకు పలు కార్యక్రమాలు రూపొందించామని అవి విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. కేసీఆర్‌ మంత్రివర్గ విస్తరణ చేపట్టినప్పటికీ పాలన గాడిలో పడలేదన్నారు. కీలక శాఖలన్నీ కేసీఆర్‌ దగ్గరే పెట్టుకోవడంతో పనులు జరగడం లేదన్నారు. పురపాలక శాఖలో ఫైళ్లు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయన్నారు. యూపీఏలోని పార్టీలు జాతీయస్థాయిలో పొత్తు కుదుర్చుకుంటాయని, రాష్ట్రాల్లోనేమో కలిసి ఉండవన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top