రోగులకు రెడీమేడ్ ఆహారం! | ready to eat food for patients in government hospitals | Sakshi
Sakshi News home page

రోగులకు రెడీమేడ్ ఆహారం!

Sep 4 2014 1:22 AM | Updated on Sep 2 2017 12:49 PM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంటుగా ఉంటూ వైద్యం పొందుతున్న వారికి రెడీమేడ్ ఆహారం పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఉభయరాష్ట్రాల వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో త్వరలో అమలు
పోషకాల సమతుల్యంతో కిచిడీ, ఉప్మా, హల్వా తయారీ
రోజుకు 1,400 కేలరీలతో రోగికి ఆహార ం
అంగన్‌వాడీల్లో సరికొత్త రుచులు!


 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంటుగా ఉంటూ వైద్యం పొందుతున్న వారికి రెడీమేడ్ ఆహారం పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో స్థానిక కాంట్రాక్టర్లు వండిన భోజనం రోగులకు అందజేస్తున్నారు. దీనికి ఒక్కో రోగి నుంచి డైట్ చార్జీల కింద రోజుకు రూ. 40 ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇదే ధరను ఇకపై ఏపీ ఫుడ్స్ సరఫరా చేసే రెడీమేడ్ డైట్‌కు ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది.

 ఈమేరకు ఏపీ ఫుడ్స్ అధికారులతో వైద్యాధికారులు చర్చలు జరుపుతున్నారు. ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు ఈ ఆహారం అందివ్వాలనుకుంటున్నారు. ప్రస్తుతం కాంట్రాక్టర్లు పెట్టే భోజనం నాసిరకంగా ఉందని, సరిపడినన్ని కేలరీలు, పోషకాలు లేవని ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో వేడినీటిలో వేస్తే సిద్ధమైపోయే రెడీమేడ్ కిచిడి, హల్వా, ఉప్మా తదితర పదార్థాలను రోగులకు అందిస్తే ఉభయ రాష్ట్రాల్లో ఉన్న 16 వేల మంది ఇన్‌పేషెంట్లకు ఉపయుక్తంగా ఉంటుందని యోచిస్తున్నారు. ఈ పదార్థాలలో సమతుల పోషకాలు ఉండేలా చూస్తూ.. రోజూ ఇచ్చే ఆహారంలో 1,400 కేలరీలు ఉండేలా తయారు చేస్తారు. ఈ ఆహారంతో పాటు అరటిపండు, కోడిగుడ్డు విడిగా ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఇది సఫలమైతే మిగతా ఆస్పత్రుల్లోనూ అమలు చేయనున్నారు.
 
 రూ.100 కోట్లతో కొత్త యంత్రాలు..
 ఉభయ రాష్ట్రాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు ఆహారం సరఫరా చేస్తున్న ఏపీఫుడ్స్ రూ.100 కోట్లతో కొత్త మెషినరీని ఏర్పాటు చేయబోతోంది. మరో మూడు మాసాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటితో రోజుకు 450 మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలను తయారు చేస్తారు. ప్రస్తుతం అంగన్‌వాడీల్లో కుర్‌కురే, బాలామృతం పేరుతో ఆహారం తయారు చేస్తున్నారు. వీటి స్థానంలో కొత్త రుచులను అందించాలని భావిస్తున్నారు. అంతేగాకుండా సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ఉన్న హాస్టళ్ల విద్యార్థులకూ ఏపీ ఫుడ్స్ రెడీమేడ్ ఆహారం ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నట్టు ఒక అధికారి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement