ఇక తక్కువ సమయంలోనే కొత్త వంగడాల సృష్టి

RapidGen is the newest system in ICRISAT - Sakshi

ర్యాపిడ్‌జెన్‌ పేరుతో ఇక్రిశాట్‌లో సరికొత్త వ్యవస్థ

ఏడాదిలో ఆరు తరాల పంటలు పెంచవచ్చు

ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇలాంటిది ఇదే తొలిసారి

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయం కొత్త పుంతలు తొక్కేందుకు హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) వేదిక కానుంది. ర్యాపిడ్‌జెన్‌ పేరు గల ఈ వ్యవస్థ సాయంతో ఇప్పటివరకూ పది పన్నెండేళ్ల సమయం పట్టే కొత్త వంగడాల సృష్టిని అతితక్కువ సమయంలో సాధించవచ్చునని, ప్రభుత్వరంగ సంస్థల్లో ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు ఇదే తొలిసారని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పీటర్‌ కార్‌బెరీ శుక్రవారం విలేకరులకు వివరించారు. ఇక్రిశాట్‌లోని జన్యుబ్యాంకులో మంచి లక్షణాలున్న పురాతన వంగడాలు చాలా ఉన్నాయని.. వాటిని వేగంగా రైతుల పొలాల్లోకి చేర్చేందుకు ర్యాపిడ్‌జెన్‌ ఉపయోగపడుతుందని వివరించారు. ఈ వ్యవస్థ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సీనియర్‌ శాస్త్రవేత్త పూజా భట్నాగర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... 

‘‘అధిక దిగుబడి నిచ్చే.. లేదా ఏ మంచి లక్షణంతో కూడిన వంగడాన్ని అభివృద్ధి చేయాలన్నా ఇప్పుడు ఏళ్ల సమయం పడుతుంది. ఆయా లక్షణాలున్న 2 వంగడాలను వేర్వేరు పద్ధతుల ద్వారా సంకరం చేసి మొక్కలను పెంచడం.. వాటిల్లో మనకు కావాల్సిన లక్షణాలు ఉన్న వాటిని వేరు చేసి మళ్లీ పెంచడం.. ఇలా సుమారు ఆరు నుంచి ఏడు తరాల పాటు మొక్కలు పెంచిన తరువాతగానీ మన అవసరాలకు తగిన లక్షణాలున్న వంగడం అభివృద్ధి కాదు. ఆ తరువాత వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో, నేలల్లో కొత్త వంగడాన్ని పండించి పరిశీలిస్తారు. ఆ తర్వాతే రైతులకు దాన్ని అందుబాటులోకి తెస్తారు.

ఈ సుదీర్ఘకాలపు ప్రక్రియను కుదించేందుకు ర్యాపిడ్‌జెన్‌ ఉపయోగపడుతుంది.  వాతావరణ పరిస్థితులు, పోషకాలు, వెలుతురు వంటి అన్నింటినీ కృత్రిమ పద్ధతుల్లో మొక్కలకు అందిస్తారు. మొక్కలు వేగంగా పుష్పించేలా.. విత్తనాలు ఇచ్చేలా చేస్తారు. తద్వారా ఒక్కో పంటకు ఏడాదిపాటు వేచి చూడాల్సిన అవసరం ఉండదు.  4 నెలల్లో పండాల్సిన ఖరీఫ్‌ పంట 50 రోజుల్లోనే పండిపోతుంది.  పంటలను వేగంగా పండించి ఆ విత్తనాలను ఒకట్రెండేళ్లలోనే క్షేత్ర పరీక్షలకు సిద్ధం చేయవచ్చు’’అని తెలిపారు.  

ప్రస్తుతానికి తాము సంప్రదాయ వంగడ అభివృద్ధి ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి పెట్టామని, అత్యాధునిక జన్యు ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులు, మార్కెట్‌ అవసరాలకు తగ్గ వంగడాలను సృష్టించేలా ర్యాపిడ్‌జెన్‌ను అభివృద్ధి చేస్తామని ఇక్రిశాట్‌ వంగడ అభివృద్ధి విభాగపు అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ యాన్‌ దబానే తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top