పొరపాటైంది.. క్షమించండి! 

Rajat Kumar Apologised For Vote Missings - Sakshi

లక్షల్లో ఓట్ల గల్లంతుపై సారీ చెప్పిన రజత్‌ కుమార్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితాలో పేర్లు కనిపించనందున ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన లక్షల మందికి.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌ కుమార్‌ క్షమాపణలు కోరారు. ఓటు కోల్పోయామన్న బాధను చాలా మంది తనకే స్వయంగా ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారన్నారు. 2015లో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఐఆర్‌ఈఆర్‌) కార్యక్రమంలో పొరపాట్లు జరిగాయని, నిబంధనలు పాటించకుండానే ఓట్లను తొలగించడంతో ఈ సమస్య ఉత్పన్నమైందని అంగీకరించారు.

శుక్రవారం పోలింగ్‌ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా పలుమార్లు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించామని, అయితే వీరెవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో ఓటేయలేకపోయారన్నారు. రెండు నెలల్లో 25 లక్షల మంది కొత్త ఓటర్లను జాబితాలో చేర్చామని, జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలని ప్రచారోద్యమం సైతం నిర్వహించామన్నారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓటు తొలగింపుపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశించామన్నారు. వ్యక్తిగతంగా గుత్తా జ్వాలకు క్షమాపణలు తెలియజేశారు.

ఓటరు జాబితాలో పేర్లను కోల్పోయిన వారు మళ్లీ ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 26 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈసారి అత్యంత జాగ్రత్తగా ఓటర్ల జాబితా రూపొందిస్తామన్నారు. 2014లో అసెంబ్లీ, పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో 69.5 శాతం పోలింగ్‌ నమోదు కాగా, ఈ సారి 67 శాతం వరకు నమోదైందన్నారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు, అవాంతరాలు లేకుండా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఎన్నికల్లో దాదాపు 2లక్షల మంది అధికారులు, సిబ్బంది, 50 వేల మంది పోలీసులు విధులు నిర్వహించారన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.  

రీ–పోలింగ్‌ ఉండకపోవచ్చు 
ఎన్నిక సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తమ దృష్టికి రానందున.. రీ–పోలింగ్‌కు అవకాశం ఉండకపోవచ్చని రజత్‌ కుమార్‌ తెలిపారు. పోలింగ్‌ అనంతరం ఈవీఎంలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య గోదాములకు తరలిస్తున్నామన్నారు. గోదాముల్లో 24గంటల విద్యుత్‌ సరఫరాతో పాటు సీసీ టీవీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా రికార్డు స్థాయిలో నగదు (రూ.117.2కోట్లు, మద్యం (5.4లక్షల లీటర్లు), ఇతర కానుకలు (రూ.9.2కోట్ల విలువైన బంగారం, వెండితోపాటు మాదక ద్రవ్యాలు) పట్టుబడ్డాయన్నారు.

దీంతో మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.138 కోట్లకు చేరిందన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై 4292 ఫిర్యాదులు అందగా వాటన్నింటినీ.. పరిష్కరించామన్నారు. చాలా వరకు మానవ తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించాయని రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. పనిచేయని ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ యంత్రాలను సాధ్యమైనంత త్వరగా మార్చి కొత్తవి ఏర్పాటు చేయడం ద్వారా పోలింగ్‌ను ప్రారంభించామని రజత్‌ కుమార్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top