వాన నీటిలో నారసింహుడు 

Rain water into the Yadadri temple - Sakshi

నీటితో నిండిపోయిన గర్భాలయ ముఖ మండపం

స్వయంభూమూర్తుల చెంతకు వెళ్లాయంటున్న కూలీలు

అపచారమంటున్న పలువురు అర్చకులు  

డ్రెయినేజీ వ్యవస్థను మరిచిన అధికారులు

ప్రారంభంలోనే ఏర్పాటు చేయకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవంటున్న పండితులు

యాదగిరికొండ(ఆలేరు) : రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ప్రధానాలయంలోని స్వయంభు గర్భాలయం ముం దున్న ముఖమండపం బుధవారం రాత్రి కురిసిన వాననీటితో పూర్తిగా నిండిపోయింది. స్వయంభుమూర్తుల వద్దకు సైతం నీళ్లు వెళ్లాయని పనిచేసే కూలీలు పేర్కొన్నారు. ఇది చాలా అపచారమని, మనం కాళ్లతో తొక్కిన నీరు స్వామి వారిని తాకితే  మంచిది కాదని కొందరు అర్చకులు తెలిపారు. ఆ నీటిలోనే నిలబడి ఆరగింపు, ఆరాధన, అభిషేకం కానిస్తున్నారు.

కనీసం ఆలయ అర్చకులైనా ఈ విధానం సరైంది కాదని అధికారులకు చెప్పడం లేదు. స్వయంభుమూర్తుల వద్ద నీటిలోనే నిత్యకైంకర్యాలు మమ అనిపిస్తున్నారు. నిర్మాణానికి ముందే ఈ విధంగా వాన నీరు వస్తే ఏ చర్యలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు    అంటున్నారు. ప్రస్తుతానికి మోటార్లతో నీటిని తోడేస్తున్నారు. ప్రతి నిర్మాణానికి  డ్రెయినేజీ ముఖ్యమైంది.

కానీ ఇంత పెద్ద నిర్మాణం చేపట్టిన అధికారులు వర్షపు నీరు వెళ్లే మార్గం ఆలోచించలేక పోయారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆర్కిటెక్టు ఆనందసాయి, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావులు  మట్లాడుతూ కొండపూర్తిగా రాయితో నిండి ఉంద,ని రాయిని పగలకొట్టడం  జరగలేదని తెలిపారు. కానీ భవిష్యత్‌లో డ్రెయినేజీ బయటకు కనిపించకుండా చేసి ఎవరూ ఊహించని రీతిలో నిర్మించనున్నట్టు చెప్పారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top