వానొస్తే.. వరద మొదలైతే..

Rain threat to Kaleshwaram project work! - Sakshi

కాళేశ్వరం పనులకు వర్షం ముప్పు! 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులకు కొత్త సమస్య మొదలవుతుందేమోనన్న ఆందోళన పట్టుకుంది. కొద్దిరోజుల్లో వర్షాకాలం ప్రారంభం అవుతుండటంతో.. బ్యారేజీలు, పంపుహౌజ్‌ల నిర్మాణం ఇప్పుడున్న వేగంతో కొనసాగడం సవాలుగా మారనుంది. ముఖ్యంగా గోదావరిలో వరద మొదలైతే.. మేడిగడ్డ సహా పలు బ్యారేజీల పనులు నిలిచిపోయే అవకాశం ఉండనుంది. ముఖ్యంగా మేడిగడ్డ పంపుహౌజ్‌ పరిధిలోని గ్రావిటీ కెనాల్‌ కింద చేపట్టాల్సిన ఉన్న నిర్మాణాలకు ఇబ్బందులు కలుగనున్నాయి. ఈ నేపథ్యంలో పనులను ముమ్మరంగా కొనసాగించేందుకు.. నిర్మాణ ప్రాంతాల్లో యంత్రాలు, కార్మికుల సంఖ్యను మరింతగా పెంచాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేశారు. 

వరుసగా అవరోధాలు.. 
కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంపుహౌజ్‌లను జూలై నాటికి పూర్తిచేసి ఆగస్టు నుంచి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం సంకల్పించినా.. వరుసగా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇటీవలి వరకు తీవ్రమైన వేసవి, నలభై డిగ్రీలకుపైగా ఎండలు ఒకవైపు.. కార్మికుల కొరత మరోవైపు పనులు జాప్యం కావడానికి కారణమయ్యాయి. ఇప్పుడు వర్షాలు, గోదావరి వరద భయం వెన్నాడుతోంది. పనులు ఇదే వేగంతో ముందుకు సాగుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో మొత్తంగా 85 గేట్లు బిగించే పనులను 11 బ్లాక్‌లుగా విడగొట్టి చేపట్టారు. ఇందులో 35 గేట్లు బిగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కాంక్రీట్‌ పనులు నెమ్మదించాయి. ఇక ఇక్కడ గరిష్టంగా 10 లక్షల క్యూసెక్కుల మేర వరద రావచ్చన్న అంచనాతో 44 గేట్ల మేర నిర్మించే 4వ బ్లాక్‌ను ప్రవాహానికి వీలుగా ఖాళీగా ఉంచారు. ఒకవేళ అంతకు మించి వరద వస్తే మిగతా బ్లాక్‌ల పరిధిలోని గేట్ల బిగింపు ప్రక్రియకు ఇబ్బంది ఎదురవక తప్పని పరిస్థితి. 

నెమ్మదించిన ఫ్లడ్‌ బ్యాంకుల పనులు 
ఇక గోదావరి వరదను నివారించేందుకు నదికి ఇరువైపులా ఫ్లడ్‌ బ్యాంకుల నిర్మాణాన్ని చేపట్టారు. అందులో మహారాష్ట్ర వైపునే 10 కిలోమీటర్ల మేర ఫ్లడ్‌ బ్యాంకులు నిర్మించాల్సి ఉంది. అందులో 5 కిలోమీటర్ల మేర నిర్మాణం అత్యవసరం. నదిలో వరద మొదలవడానికి ముందే ఆ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నా.. ఇప్పటికే మొదలైన వర్షాల కారణంగా నల్లమట్టి తరలింపు, రివిట్‌మెంట్‌ పనులు నెమ్మదించాయి. అటు తెలంగాణ వైపున 6 కిలోమీటర్ల మేర ఫ్లడ్‌బ్యాంక్‌ నిర్మించాల్సి ఉండగా.. 5 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు కూడా వర్షాలతో ఇబ్బంది ఎదురవుతోంది.  

మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్నా.. 
మేడిగడ్డ బ్యారేజీ పంపుహౌజ్‌ పరిధిలో నదిలోకి నీళ్లు రాకముందే డ్రాఫ్ట్‌ ట్యూబ్‌లు, హెడ్‌రెగ్యులేటరీ గేట్లు, బ్రెస్ట్‌ వాల్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే వర్షాలు మొదలై నీరు వస్తుండటంతో.. ప్రత్యేకంగా మోటార్లు పెట్టి ఆ నీటిని తోడేస్తున్నారు. వర్షాలు పెరిగితే ఇక్కడి పనులు ఆలస్యం కానున్నాయి. ఇక 13 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్‌ పనుల్లో 90 శాతం పనులు పూర్తికాగా.. మరో 12 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టిని తవ్వాల్సి ఉంది. ఈ కెనాల్‌ పరిధిలో పెద్దవాగును దాటేందుకు 29 నిర్మాణాలు (స్ట్రక్చర్లు) ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 24 పురోగతిలో ఉన్నాయి. అయితే వర్షాలు పెరిగి పెద్దవాగులో నీటి ప్రవాహం మొదలైతే.. 9 అండర్‌టన్నెల్‌ నిర్మాణాల పనులు ఆగిపోనున్నాయి. 

అన్నారం, సుందిళ్ల వద్దా ఇదే పరిస్థితి 
అన్నారం బ్యారేజీలో మట్టిపని పూర్తికాగా.. 11 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులకుగాను 1.19 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని మిగిలి ఉంది. ఇక్కడ 66 గేట్లకుగాను 45 గేట్లను సిద్ధం చేయగా.. అందులో 18 గేట్ల బిగింపు పూర్తయింది. అయితే వర్షాలతో కాంక్రీట్‌ పనులకు ఆటంకం ఏర్పడుతుండటంతో.. మిగతా గేట్ల తయారీ, బిగింపు పనుల వేగం పెంచాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 8 క్రేన్లతో పనులు చేస్తుండగా.. మరో 8 క్రేన్లు అదనంగా తెప్పించి పనులు చేయాలని సూచించారు.

ఇక సుందిళ్ల పరిధిలో 10.09 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనికిగాను.. 8.53 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర పూర్తయింది. మిగతా పనిని జూలై 15 నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇక్కడ 74 గేట్లకు గాను 64 గేట్లు సిద్ధం చేయగా.. ఇప్పటివరకు 17 గేట్లనే బిగించారు.  ఇక అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిధిలోనూ ఫ్లడ్‌ బ్యాంకుల పనులు చేయాల్సి ఉంది. వర్షాలు, వరద కారణంగా ఆటంకాలు ఎదురైతే.. నిర్మాణ పనులు ఆగస్టు వరకు కొనసాగే అవకాశముందని, సెప్టెంబర్‌ వరకు నీళ్లిచ్చే పరిస్థితి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top