కాగితాల్లోనే రైల్వే ప్రాజెక్టులు | Railway projects in South Central Railway meeting | Sakshi
Sakshi News home page

కాగితాల్లోనే రైల్వే ప్రాజెక్టులు

May 12 2017 4:49 AM | Updated on Aug 28 2018 7:57 PM

కాగితాల్లోనే రైల్వే ప్రాజెక్టులు - Sakshi

కాగితాల్లోనే రైల్వే ప్రాజెక్టులు

రాష్ట్రంలో అనేక రైల్వే ప్రాజెక్టులు ఏళ్లకు ఏళ్లు కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఎంపీలతో సమావేశం ఒక తంతులా మారుతోందని పలువురు పార్లమెంటు సభ్యులు

దక్షిణమధ్య రైల్వే సమావేశంలో ఎంపీల అసంతృప్తి
ప్రతిపాదనలకు ప్రాధాన్యమివ్వడంలేదు
ఎంపీల సమావేశం ఓ తంతులా మారిందంటూ ధ్వజం
 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అనేక రైల్వే ప్రాజెక్టులు ఏళ్లకు ఏళ్లు కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఎంపీలతో సమావేశం ఒక తంతులా మారుతోందని పలువురు పార్లమెంటు సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, తమ ప్రతిపాదనలకు ప్రాధాన్యతనివ్వడం లేదని ధ్వజమెత్తారు. గురువారం రైల్‌ నిలయంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన ఎంపీల సమావేశం జరిగింది. దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో... ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బాల్క సుమన్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, గరికపాటి మోహన్‌రావు, జి.నగేశ్, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీతారాంనాయక్, నంది ఎల్లయ్య, పసునూరి దయాకర్, భగవంత్‌ ఖుబా, సునీల్‌ బలిరామ్‌ గైక్వాడ్, బీవీ నాయక్‌ పాల్గొన్నారు. కాగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సమా వేశానికి హాజరుకాక పోవడం గమనార్హం.

దాహంతో అల్లాడుతున్నారు...
తమ నియోజకవర్గాల్లో పెండింగ్‌ ప్రాజెక్టులు, రైళ్ల హాల్టింగ్, రైల్వే స్టేషన్‌లలో సమస్యలపై ఎంపీలు జీఎం దృష్టికి తెచ్చారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు, రాష్ట్రంలోని అనేక స్టేషన్లలో మంచి నీటి కొరత తీవ్రంగా ఉందని, సుప్రీంకోర్టు ఆదేశించినా రైల్వే ఉచితంగా నీటిని అందజేయకపోవడంతో ప్రయాణికులు దాహంతో అల్లాడుతున్నారని ఆనందభాస్కర్, నంది ఎల్లయ్య చెప్పారు. మరోవైపు ఇటీవల కాలంలో తరచుగా చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ట్రైన్‌ బయలుదేరడానికి ముందే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేయాలని సూచించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌– సూర్యాపేట్‌ కొత్త రైలు మార్గానికి సర్వే పూర్తయిందని, వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. జనగామ స్టేషన్‌లో శాతవాహన, చార్మినార్, నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ ఇవ్వాలన్నారు. గత 20 ఏళ్లుగా నల్లగొండ– మాచర్ల రైల్వేలైన్‌ నిర్మాణం కాగితాలకే పరిమితమైందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌–అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌ లైన్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

60 శాతం ఆదాయం దక్షిణాది నుంచి వస్తున్నా...
రైల్వేలకు 60 శాతం ఆదాయం దక్షిణాది నుంచే లభిస్తున్నప్పటికీ ఉద్యోగాలు, ఉన్నత పదవులు మాత్రం ఉత్తరాదికే పరిమితమవుతున్నాయని, తెలంగాణ, ఏపీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీతారాంనాయక్‌ చెప్పారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను గద్వాల్‌ మీదుగా నడపాలని పాల్వాయి కోరారు. ఎంఎంటీఎస్‌ రెండో దశకు రక్షణ శాఖ భూములపై నెలకొన్న అడ్డంకులు తొలగిపోయిన దృష్ట్యా సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయాలని మల్లారెడ్డి కోరారు. ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు తలపెట్టిన యాదాద్రి ఎంఎంటీఎస్‌ రైల్వేలైన్‌ పనులను వెంటనే ప్రారంభించాలని భువనగిరి ఎంపీ నర్సయ్యగౌడ్‌ కోరారు. పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి స్టేషన్లలో సదుపాయాలు మెరుగుపర్చాలని, అదనపు రైళ్లకు హాల్టింగ్‌ కల్పించాలని బాల్క సుమన్‌ కోరారు.

అన్ని చోట్లా హాల్టింగ్‌లు సాధ్యంకాదు
సమావేశం అనంతరం జీఎం వినోద్‌కుమార్‌ మా ట్లాడుతూ... ఎంపీల ప్రతిపాదనలు, విజ్ఞప్తుల్లో సాధ్యమైనన్నింటిపైనా త్వరలోనే కార్యాచరణ చేపడతామన్నా రు. ఎంపీలు కోరినట్లు అన్ని చోట్ల రైళ్లను ఆపడం సాధ్యం కాదని, దానివల్ల రైళ్ల వేగం తగ్గుతుందన్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశలో ఒక లైన్‌ ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తవుతుందన్నారు. తెల్లాపూర్‌–పటాన్‌చెరు మార్గంలో ఎంఎటీఎస్‌ రైళ్లు అందుబాటులోకి వస్తా యన్నారు. 2018 నాటికి అన్ని లైన్లూ పూర్తి చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement