మేడారం జాతరకు 4వేల బస్సులు: మంత్రి పువ్వాడ

Puvvada Ajay Kumar: Each RTC Depot Will Be Adopted By A Officer - Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగులుకు మార్చి 31 లోపు సమ్మె కాలానికి వేతనాలు చెల్లిస్తామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలిపారు. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో కొత్త ఛాంబర్‌ను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, సందీప్ కుమార్ సుల్తానీయ, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ కోసం ఈ-బిడ్డింగ్ విధానం ప్రారంభించామని తెలిపారు. ఫాన్సీ నంబర్స్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, వాహనాలకు నెంబర్ ఫోర్ట్ బులిటీకి ప్రయత్నిస్తున్నామన్నారు. రవాణా శాఖ 59 ఆన్‌లైన్‌ సర్వీస్‌లు అందిస్తుందన్నారు. 

ఆర్టీసీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బ్రాండ్ అంబాసిడర్‌ అని, కేసీఆర్ ఫోటోలతో త్వరలో కొత్త స్లొగన్స్ అవిష్కరిస్తామని మంత్రి తెలిపారు. కార్గో సేవలు ఫిబ్రవరి 10 లోపు ప్రారంభిస్తామని, కార్గో సేవల ధరలను ఇంకా నిర్ణయించలేదని అన్నారు. అలాగే ఒక్కో ఆర్టీసీ డిపోని ఒక్కో అధికారి దత్తత తీసుకుంటారని తెలిపారు. సంక్రాంతి ఒక్క రోజే ఆర్టీసీ రూ. 16.8 కోట్ల ఆదాయం వచ్చిందని, మేడారం జాతరకు 4 వేల బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు. జనవరి 31న రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకుని రోడ్డు ప్రమాదాలు నివారించాలని సూచించారు. ఈసారి బడ్జెట్‌లో రూ. 1500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి కోరుతున్నట్లు వెల్లడించారు.
చదవండి : ఆర్టీసీలో సంక్షేమ బోర్డులు

ఆర్టీసీ ఉద్యోగ భద్రతే తమకు ప్రధానమన్నారు. మూడు మాసాలుగా ఏ ఒక్క కార్మికుడిని సస్పెండ్ చెయ్యలేదని పువ్వాడ అజయ్‌ తెలిపారు. ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చమని, ఆర్టీసీ సిబ్బందికి సొంతగా యాజమాన్యం వేతనాలు ఇచ్చిందన్నారు. వాహనాల కొనుగోలు సంఖ్య తగ్గడంతో టాక్స్ రెవెన్యూ పడిపోయిందని పేర్కొన్నారు. మాంద్యం ప్రభావం రవాణా శాఖపై కూడా ఉంటుందన్నారు. ప్రభుత్వానికి రవాణా శాఖ ద్వారా రూ. 3 వేల కోట్ల ఆదాయము వస్తుందని, రవాణా శాఖ ఖర్చు రూ.180 కోట్లు మాత్రనని, ఇంకా ఖర్చులను తగ్గించుకుంటామని చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు పెంచలేదని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top