డీఈఓ సారూ.. గిదేం తీరు? | Sakshi
Sakshi News home page

డీఈఓ సారూ.. గిదేం తీరు?

Published Thu, Jul 31 2014 12:05 AM

ఒక గదిలో అనేక తరగతులకు బోధిస్తున్న ప్రధానోపాధ్యాయురాలు

- పది తరగతులకు.. ఒక్కరే ఉపాధ్యాయిని!
- వలంటీర్లను కూడా నియమించని వైనం
- ఆందోళనలో తడ్కల్ విద్యార్థులు

తడ్కల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నా క్షే త్రస్థాయి పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ని నియమించాల్సి ఉండగా ఎక్కడా ఇది అమలుకు నోచుకోవడం లేదు. కంగ్టి మండలం తడ్కల్‌లో ఒకటి నుంచి పదో తరగతి వరకు కొనసాగుతున్న ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో ఒకే ఒక్క ఉపాధ్యాయురాలు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఈమె సెలవు పెడితే స్కూల్ తెరుచుకోని పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని నమ్మి తమ పిల్లలను చేర్పిస్తే ఇక్కడ పాఠాలు బోధించే వారే కరువయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాఅభియాన్ ఆధ్వర్యంలో 2011 జనవరి 12న తడ్కల్ పాఠశాలను తొమ్మిదో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం 122 మంది విద్యార్థులతో పదో తరగతి వరకు ఇక్కడ అందుబాటులో ఉందని స్కూల్ హెచ్‌ఎం రజియాసుల్తానా తెలిపారు. తరగతులు పెంచేందుకు అనుమతి ఇస్తున్న విద్యాశాఖ అధికారులు దీనికి తగ్గట్టుగా సిబ్బందిని నియమించడంలో దారుణంగా విఫలం అవుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

పదో తరగతి వరకు నడుస్తున్న తడ్కల్ ఉర్దూ పాఠశాలకు కేవలం మూడు ఎస్‌జీటీ పోస్టులు మాత్రమే మంజూరయ్యాయి. ప్రస్తుతం ఒక్కరంటే ఒక్కరే పాఠశాలను నిర్వహిస్తున్నారు. గతంలో విద్యా వలంటీర్ల ద్వారా చదువులు అందించినా ఈ సారి అది కూడా లేదు. దీంతో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. తమ పిల్లలను ఉర్దూ మీడియం కాకుండా తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో చదివించినా ఈ దుస్థితి ఉండేది కాదని పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా డీఈఓ స్పందించి పాఠశాలలో పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. కనీసం వలంటీర్లనైనా నియమించాలని వేడుకుంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement