చిన్న గుడ్డు.. దొడ్డు బియ్యం!

Problems Attack on Anganwadi centers - Sakshi

అంగన్‌వాడీ కేంద్రాలపై సమస్యల దాడి 

అంగన్‌వాడీ కేంద్రాలు సమస్యలతో సతమతం అవుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 20 రోజులుగా అంగన్‌వాడీలకు పాల సరఫరా నిలిచిపోయింది. హాస్టళ్లు, స్కూళ్లకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లుగానే అంగన్‌వాడీలకు అందజేస్తామని గతేడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ప్రకటించినా.. ఆ దిశగా ఇంతవరకు ఒక్క అడుగూ పడలేదు. చాలాచోట్ల చిన్నారులు దొడ్డు బియ్యం తినలేకపోతున్నారు. ఇక వసతులు సంగతి సరేసరి.. సొంత భవనాలు లేక చాలా కేంద్రాలు ఇరుకైన అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. తాగునీటి వసతి, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. గ్యాస్‌ సరఫరా చేయకపోవడంతో వంటకు కట్టెల పొయ్యిలే దిక్కవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 3,500 కేంద్రాలు ఉండగా.. వీటిలో 1,102 అద్దె భవనాల్లోనే కొనసాగుతుండటం గమనార్హం.     
– సాక్షి, నెట్‌వర్క్‌

పాల సరఫరా ఏది? 
ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలకు నిత్యం 200 మిల్లీలీటర్ల చొప్పున పాలు, కోడిగుడ్డు, ఒకపూట భోజనాన్ని అంగన్‌వాడీలు ప్రతిరోజూ అందించాలి. కొద్ది రోజుల వరకు స్థానిక వ్యాపారుల నుంచి కేంద్రాలు పాలు కొనుగోలు చేసేవి. అయితే పాలల్లో నాణ్యత లేకపోవడం, కల్తీ అవుతుండటం తదితర కారణాలతో ఆ పాల కొనుగోళ్లను ప్రభుత్వం నిలిపి వేసింది. దీనికి బదులుగా ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నుంచి పాలను టెట్రాప్యాక్‌ల రూపంలో సరఫరా చేయాలని నిర్ణయించింది. కానీ 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు పాల సరఫరా ఊసే లేకపోవడంతో కేవలం అన్నం, గుడ్డు మాత్రమే అందిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో రెండు నెలలుగా పాల పంపిణీ లేదు. గతంలో కనీసం నీళ్లపాలయినా ఇచ్చేవారని, ఇప్పుడు అవి కూడా అందడం లేదని గర్భిణులు, బాలింతలు చెబుతున్నారు. మెదక్‌ జిల్లాలోని పలు అంగన్‌వాడీ సెంటర్లకు మూడు నెలలుగా పాలు సరఫరా కావడం లేదు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో పాల నాణ్యతపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

చిక్కిపోతున్న గుడ్డు 
కాంట్రాక్టర్లు చాలా అంగన్‌వాడీ కేంద్రాలకు తక్కువ బరువున్న గుడ్లను సరఫరా చేస్తున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు మిన్నకుండి పోతున్నారు. ప్రతి గుడ్డు తప్పనిసరిగా 50 గ్రాముల బరువు ఉండాలి. కానీ 35–40 గ్రాములకు మించడం లేవు. పౌల్ట్రీ ఫాంలోనే చిన్నసైజు గుడ్లను వేరుచేసి అంగన్‌వాడీ సెంటర్లకు సరఫరా చేస్తున్నారు. ఈ చిన్న సైజు గుడ్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కాంట్రాక్టర్లు నెలలో మూడు సార్లు అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లు పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం ఒకట్రెండుసార్లు సరఫరా చేస్తున్నారు. వాటిల్లో పగిలిపోయినవి, పగుళ్లు ఉన్నవి ఉండటంతో చాలా గుడ్లు పాడైపోతున్నాయి. బిల్లులు రాకపోవడంతోనే పూర్తిస్థాయిలో సరఫరా చేయడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో గుడ్లు పంపిణీ చేసే కాంట్రాక్టర్‌ గడువు జనవరిలో ముగిసింది. టెండర్‌ దక్కించుకున్న కొత్త కాంట్రాక్టర్‌.. ధర గిట్టుబాటు కావడం లేదంటూ 20 రోజులుగా గుడ్లు పంపిణీ చేయడంలేదు. 

ఇది నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎండబెట్ల–1 అంగన్‌వాడీ కేంద్రం. ఇక్కడ చిన్నారుల ప్లేట్లను గమనించండి.. కేవలం ఉడకబెట్టిన గుడ్డు మాత్రమే కన్పిస్తోంది కదా. ఇదే వీరి భోజనం! ఈ సెంటర్లో కొన్నాళ్లుగా గుడ్డు మాత్రమే పెట్టి పంపించేస్తున్నారు. ఇదేమని అంగన్‌వాడీ టీచర్‌ను అడిగితే.. రెండు వారాలుగా బియ్యం రావడం లేదని చెప్పింది. బియ్యమే కాదు.. పాలు, పప్పు, నూనె.. ఇలా ఏదీ రావడం లేదని చెబుతోంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం పరిస్థితి ఇది.

ఒకే గదిలో వంట.. పిల్లలు.. 
కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్ర భవనానికి వంట గది లేదు. దీంతో ఉన్న ఒకే గదిలోనే ఓ మూలకు విద్యార్థులను కూర్చోబెట్టి, మరో పక్క ఇలా వంట వండుతున్నారు. 

కుడితిలో బాలామృతం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్‌ మండలం అంగన్‌వాడీ సెంటర్‌లో సరఫరా చేసే బాలామృతం పశువులకు పెడుతున్నారు. అందులోని పోషక విలువలు తెలియకో.. నాణ్యతగా ఉండదని భావించో అనేక మంది తల్లులు బాలామృతాన్ని ఇంటికి తీసుకెళ్లి ఇలా బర్రెలు, అవులకు కుడితిలో కలిపి తాపిస్తున్నారు.

ఆయాలే.. అంతా! 
అంగన్‌వాడీ సెంటర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగాలి. టీచర్లు విధులకు డుమ్మాలు కొడుతుండడంతో భారమంతా ఆయాలపైనే పడుతోంది. చిన్నారుల నిర్వహణ, అటు గర్భిణులు, బాలింతలకు భోజనం వడ్డించడం కష్టంగా వారికి మారుతోంది. చాలాచోట్ల కేంద్రాలను ఎప్పుడు తెరుస్తున్నారో.. ఎప్పుడు మూస్తున్నారో తెలియడం లేదు. కొన్ని అంగన్‌వాడీలైతే ఒక్కపూటకే పరిమితమవుతున్నాయి. దీనికి తోడు చాలాచోట్ల టీచర్లు, ఆయా పోస్టుల ఖాళీలు వేధిస్తున్నాయి. ఒక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే మొత్తం 627 ఖాళీలున్నాయి. పిల్లల హాజరులోనూ అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. చాలాచోట్ల పిల్లలు రాకున్నా వస్తున్నట్టు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. 

దొడ్డు బియ్యం తింటలేరు 
అంగన్‌వాడీలకు సన్నబియ్యం అస్తయి అని చెప్పిండ్లు. కానీ దొడ్డుబియ్యమే ఇస్తున్నరు. దొడ్డు అన్నం తినేందుకు పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఇష్టపడతలేరు. కోడిగుడ్లు కూడా చిన్నగా ఉంటున్నయి. కొన్నిసార్లు గుడ్లు వాసన వస్తుండటంతో పిల్లలు తినకుండానే పడేస్తున్నరు. 
    – జి.పద్మ, ఆయా, కుమురంభీం జిల్లా రెబ్బెన సెంటర్‌–1

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top