ఫీ‘జులుం’

Private Schools Demading Fee For Online Classes in Hyderabad - Sakshi

ప్రైవేటు పాఠశాలల్లో వసూళ్ల వివాదం

ఆన్‌లైన్‌ క్లాసుల కోసం ప్రత్యేక చార్ట్‌

ట్రాన్స్‌పోర్ట్, యాక్టివిటీస్, స్నాక్స్‌ లేకున్నా చార్జి  

రాయితీ ఇవ్వాలంటున్న తల్లిదండ్రులు.. నో అంటున్న యాజమాన్యాలు

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగరంలో పలు ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాసులకు శ్రీకారం చుట్టాయి. అయితే.. ఈ –క్లాసుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని హైదరాబాద్‌ స్కూల్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ సహా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధిక ఫీజుల వసూలును నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముందుగా వసూలు చేసే తొలి త్రైమాసిక ఫీజులో ట్యూషన్‌ ఫీజు మినహా ఇతరాలను మినహాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఫీజుల్లో కోతలతో పాఠశాలల నిర్వహణ కష్టతరమవుతుందని పాఠశాలల యాజమాన్యాలు చెబుతుండడం గమనార్హం.

తల్లిదండ్రుల వాదన ఇదీ..
ప్రస్తుతం నగరంలో ఆన్‌లైన్‌ విధానంలో బోధన కొనసాగిస్తున్న పలు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌ బోధిస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజులు సహా, ఇతర యాక్టివిటీస్, ఫుడ్‌ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని పేరెంట్స్‌ ఆందోళన చెందుతున్నారు. అంటే ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి వార్షిక ఫీజు లక్ష రూపాయలు అయితే.. ఇందులోనే ట్యూషన్, యాక్టివిటీస్, ఫుడ్, స్నాక్స్, ట్రాన్స్‌ పోర్ట్‌ తదితర ఫీజులు కలిపి ఉంటాయి. ఈ లక్ష రూపాయలను నాలుగు త్రైమాసికాల్లో రూ.25 వేల చొప్పున విడతలవారీగా వసూలు చేయడం పాఠశాలల ఆనవాయితీ. ప్రస్తుతం ట్రాన్స్‌పోర్ట్, ఫుడ్, స్నాక్స్, యాక్టివిటీస్‌ లేకుండా కేవలం ఆన్‌లైన్‌ విధానంలో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి త్రైమాసికంలో వసూలు చేసే రూ.25 వేలలో సుమారు 50 శాతం మినహాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. కోవిడ్‌ కలకలం నేపథ్యంలో తిరిగి పాఠశాలలను ఎప్పుడు తెరుస్తారో స్పష్టత లేని నేపథ్యంలో పూర్తిస్థాయిలో పాఠశాలలు పనిచేసే పరిస్థితి లేదు. తిరిగి స్కూల్స్‌ పునః ప్రారంభమైన సమయంలో మిగితా త్రైమాసిక ఫీజులను  పాత పద్ధతిలో వసూలు చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం పలు పాఠశాలలు ఉపాధ్యాయుల వేతనాల్లో కోత విధించాయని.. ఇతర నిర్వహణ ఖర్చులు అంతగా ఉండవని.. ఈ నేపథ్యంలోనే తొలి త్రైమాసిక ఫీజులను తగ్గించాలని కోరుతున్నారు.

పాఠశాలల వాదన ఇలా..
విద్యార్థుల నుంచి తాము వసూలు చేసే ఫీజుల్లో రాయితీ ప్రకటిస్తే తాము తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటామని ఇండిపెండెంట్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎంఏ) ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయుల వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులు, వాహనాల మరమ్మతులు, వాటి  ఈఎంఐలు, డ్రైవర్లు, ఇతర సిబ్బంది జీతభత్యాలు తడిసి మోపడవుతున్న నేపథ్యంలో ఫీజుల్లో రాయితీలు ఇవ్వలేమని చెబుతుండడం గమనార్హం.

ప్రభుత్వ నిర్ణయమే కీలకం..
విద్యార్థుల తల్లిండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు ఎవరి వాదన వారు వినిపిస్తున్న నేపథ్యంలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ తక్షణం రంగంలోకి దిగి ఫీజుల వివాదాన్ని పరిష్కరించాలని ఉభయ పక్షాలు కోరుతుండడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top