కోవింద్‌కు ఘన స్వాగతం 

President Ramnath Kovind Arrives Hyderabad For Winter Holiday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శీతాకాల విడిది కోసం శుక్రవారం నగరానికి చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది. ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను రాష్ట్రపతికి కేసీఆర్‌ పరిచయం చేశారు.

రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో మంత్రులు మహమూద్‌ అలీ, కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లితో పాటు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి రాకముందుకు హకీంపేట ఎయిర్‌పోర్టులో గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్‌ కొద్దిసేపు ముచ్చటించారు. స్వాగత కార్యక్రమం తర్వాత గవర్నర్, హోం మంత్రి వెంటరాగా రాష్ట్రపతి దంపతులు శీతాకాల విడిది బొల్లారంలోని రాష్ట్ర పతి నిలయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘గవర్నర్‌గా వంద రోజులు’నివేదికతో పాటు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ రాజ్‌భవన్‌ ముద్రించిన ‘బతుకమ్మ తెలంగాణ ఫ్లోరల్‌ ఫెస్టివల్‌’పుస్తకాన్ని రాష్ట్రపతికి తమిళిసై అందజేశారు. 

మీరేంటి ఇక్కడ.. 
స్వాగతం సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డిని రాష్ట్రపతికి కేసీఆర్‌ పరిచయం చేశారు. మీరేంటి ఇక్కడ.. ఇటువైపు వచ్చారెందుకు.. అని గుత్తాను ఉద్దేశించి రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. గతంలో కోవింద్‌ రాజ్యసభ సభ్యుడిగా, తాను లోక్‌సభ సభ్యుడిగా పార్లమెంట్‌ ఎనర్జీ కమిటీలో సభ్యులుగా పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. గుత్తా తనకు పాత స్నేహితుడని రాష్ట్రపతి చెప్పగా, తనకూ పాత స్నేహితుడే అని సీఎం సరదాగా అనడంతో నవ్వులు విరిశాయి. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి కోవింద్‌ ఈ నెల 28 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top