పీఆర్‌సీపై రేపటి నుంచే చర్చలు | Sakshi
Sakshi News home page

పీఆర్‌సీపై రేపటి నుంచే చర్చలు

Published Wed, Jan 28 2015 1:59 AM

Powered committee will discuss tomorrow with Govt employees on PRC report

* నాలుగు సమావేశాల్లోనే అన్ని సంఘాలతో భేటీలు  
* వచ్చే నెల 9తో సమావేశాలు పూర్తి
* అత్యవసర సమావేశంలో హైపవర్ కమిటీ నిర్ణయం

 
 సాక్షి, హైదరాబాద్: పీఆర్‌సీ అమలు జాప్యం అవుతుందేమోనన్న ప్రభుత్వోద్యోగుల ఆందోళనల నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో నాలుగు సమావేశాల్లోనే చర్చలు పూర్తి చేయాలని ఈ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నిర్ణయానికి వచ్చింది. బృందాల వారీగా మూడు రోజులకో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. పీఆర్‌సీపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మంగళవారం అత్యవసరంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
 వాస్తవానికి ఈ నెల 27న ఉద్యోగ సంఘాలకు పీఆర్‌సీ నివేదికను అందజేసి, వాటిల్లోని వివిధ అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చించాలని కమిటీ మొదట్లో భావించినా, ఇప్పటికే నివేదిక అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో 29వ తేదీ నుంచే సమావేశాలు నిర్వహించాలని కొన్ని సంఘాలు హైపవర్ కమిటీని కోరినట్లు తెలిసింది. దీంతో ఈనెల 29న తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్‌జీఓ), తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, రెవెన్యూ సర్వీసెస్, క్లాస్-4, డ్రైవర్స్ తదితర సంఘాలతో చర్చలు జరిపేందుకు కమిటీ సిద్ధమైంది. ఫిబ్రవరి 3న సచివాలయ ఉద్యోగుల సంఘంతో, 6న ఉపాధ్యాయ, లెక్చరర్ల సంఘాలతో, 9న పెన్షనర్ల సంఘాలతో ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.
 
 పీఆర్‌సీ నివేదికను కూడా మంగళవారం ఆర్థిక శాఖ వెబ్‌సైట్ (http://finance.telangana.gov. in)లో ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. మరోవైపు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం హైపవర్ కమిటీని కలిశాయి. కాగా, హైపవర్ కమిటీ చర్చలకు చర్యలు చేపట్టినా పీఆర్‌సీ అమలు జాప్యం అనుమానాలు మాత్రం ఉద్యోగ సంఘాల నేతల్లో తగ్గట్లేదు. చర్చలు, ఆ తరువాత పీఆర్‌సీలోని ప్రధాన అంశాలు, ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను క్రోడీకరించి ఫిబ్రవరి చివరి నాటికి కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే పరిస్థితి ఉంటుందన్న భావన వారిలో నెలకొంది. ఆ తరువాత నివేదికను ప్రభుత్వం మరోసారి పరిశీలించాక ముఖ్యమంత్రి కేసీఆర్ వీలును బట్టి కమిటీ తమ సిఫారసులను నివేదించనుంది. ఆ తరువాత వాటిని సీఎం పరిశీలించి, మరోసారి ఆయన ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కనీస మూల వేతనం పెంపు, ఫిట్‌మెంట్, నగదు రూపంలో పీఆర్‌సీ వర్తింపు తేదీ తదితర ప్రధాన అంశాలపై హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకోవడం కుదరదని, ముఖ్యమంత్రే స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసేందుకు మార్చి నెలాఖరు అవుతుందని సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
 
సమావేశాలకు ముందే సీఎం ప్రకటన?
 ఓవైపు ఉద్యోగ సంఘాలతో సమావేశాల నిర్వహణకు హైపవర్ కమిటీ కసరత్తు చేస్తుండగా, మరోవైపు త్వరలోనే పీఆర్‌సీ ప్రధాన డిమాండ్లపై సీఎం ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు మంగళవారం ఉద్యోగ సంఘాల్లో గుప్పుమన్నాయి. సంఘాలతో సమావేశాలు ఓవైపు నడుస్తుండగా, మరోవైపు సీఎంతో ప్రధాన అంశాలపై ప్రకటన చేయించాలని కొన్ని సంఘాల నేతలు పట్టుదలతో ఉన్నారు. తద్వారా ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనను కొంత తగ్గించవచ్చన్న భావన వారిలో నెలకొంది. అదే జరిగితే హైపవర్ కమిటీ శాఖల వారీగా మిగతా సమస్యలపై చర్చించే అవకాశం ఉంటుందన్న వాదన నెలకొంది.

Advertisement
Advertisement