కరెంట్‌ బాధ్యత ప్రభుత్వానిది

The power responsibility is the government's - Sakshi

భూగర్భ జలాలు కాపాడుకునే బాధ్యత మీది 

రైతులను కోరిన మంత్రి హరీశ్‌రావు 

ఆటోమేటిక్‌ స్టార్టర్లు తొలగిస్తామని రైతుల ప్రతిజ్ఞ 

సాక్షి, సిద్దిపేట: ‘మీకు కావాల్సినంత కరెంట్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ, భూగర్భ జలాలు పరిరక్షించు కోవాల్సిన బాధ్యత మీపై ఉంది..’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు రైతులనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఆటోమేటిక్‌ స్టార్టర్ల తొలిగింపుతో లాభాలపై శనివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ కమిటీల అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తుంది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని చెప్పారు.

గతంలో కనీసం మూడు గంటల విద్యుత్‌ అయినా ఇవ్వమని రైతులు ధర్నాలు చేయడంతో పాటు కరెంటు కోసం బోర్ల వద్ద పడిగాపులు కాసిన రోజులు ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు. పూర్తిస్థాయిలో కరెంటు ఇస్తున్న నేపథ్యంలో.. రైతులు ఆటోమేటిక్‌ స్టార్టర్ల ద్వారా అవసరానికి మించి నీళ్లు తోడేస్తున్నారని ఆవేదన చెందారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, రబీ పంటలు చేతికి వచ్చే సమయానికి నీరు లేకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు స్టార్టర్లను తొలగించాలని, ఇది ఉద్యమంలా ఎవరికి వారు అమలు చేయాలని కోరారు. గోదావరి జలాలతో నల్లగొండ, భువనగిరి, వరంగల్, కరీంనగర్‌ సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలు సస్యశ్యామలం అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, అప్పటి వరకు భూగర్భ జలాలు కాపాడుకోవాలని హరీశ్‌రావు సూచించారు. 

స్టార్టర్లను తొలగిస్తామని ప్రతిజ్ఞ 
తమ గ్రామంలో ఆటోమేటిక్‌ స్టార్టర్ల లేకుండా చేస్తామని సిద్దిపేట మండలం బంజరుపల్లికి చెందిన రైతులు ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వం తమ సంక్షేమం కోసం ఆలోచిస్తున్నదని, తామూ ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధమని వారు ప్రకటించారు. ఈ సందర్భంగా సాగుకు నిరంతరంగా కరెంట్‌ సరఫరా చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, టీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘురామరెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సతీష్‌కుమార్, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top