రిజర్వేషన్లపై ఉత్కంఠ!

Political-Activists Are Curious About Reservations In Local-Body-Elections In Sangareddy - Sakshi

సాక్షి, జోగిపేట(సంగారెడ్డి) : జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల సందడి నెలకొంది. సాధ్యమైనంత తొందరలోనే పురపాలక సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్టు అధికారులు ఓటర్ల గణనను చేపట్టారు. గత నెల 22న ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈ నెల 14న పూర్తి కానుంది. అధికార ఏర్పాట్ల విషయాన్ని అటుంచితే ఇటు మున్సిపల్‌ చైర్మన్‌గిరిపై ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. ఓటర్ల గణన తర్వాత ఏ మున్సిపాలిటీ రిజర్వేషన్‌ ఎవరికి కలిసి వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్‌ కలిసి వస్తే చాలు ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ఇప్పటికే యత్నాలు ముమ్మరం చేశారు.

ఒకవేళ ‘పుర’ పీఠం మహిళలకు కేటాయిస్తే తమ బంధువులనూ బరిలో దించే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే చైర్మన్‌ పదవిపై ఆశలు పెట్టుకుంటున్న వారి సంఖ్య జిల్లాలో పెరిగిపోతోంది. జిల్లాలో సంగారెడ్డి, జోగిపేట, జహీరాబాద్, సదా శివపేట మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పడిన నారాయణఖేడ్, అమీన్‌పూర్, తెల్లాపూర్, ఐడీఏ బొల్లారం  మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే వార్డుల వారిగా ఓటర్ల వివరాలు తెలుసుకున్న ఆశావహులు కౌన్సిలర్‌గా పోటీ చేసి ‘పుర’ పీఠంపై దృష్టి సారించారు. 

తొలి చైర్మన్లు ఎవరో..?
జిల్లాలో కొత్తగా ఏర్పడిన అమీన్‌పూర్, నారాయణఖేడ్, తెల్లాపూర్, ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలకు మొదటిసారిగా జరిగే ఎన్నికల్లో  చైర్మన్‌లుగా ఎవరు ఎన్నికవుతారో వేచి చూడాల్సిందే. ఈ ఎన్నికల్లో తామే కొత్త మున్సిపాలిటీలపై జెండా ఎగురవేస్తామన్న ధీమాను అధికార పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే రిజర్వేషన్లు ఏవి వస్తాయోనన్న టెన్షన్‌లో ఉన్నారు.

చైర్మన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న వారు తమకు అనూకూలంగా రిజర్వేషన్లు వస్తాయా లేదా అన్న ఉత్కంఠతతో ఉన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టంలో చైర్మన్‌ పదవికి ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కూడా ఎక్కడా ప్రస్తావన తీసుకురాకపోవడంతో పరోక్ష ఎన్నికలే జరగవచ్చని అంటున్నారు. 

పాత పాలకవర్గం ఆశలు 
గత ఎన్నికల్లో కొనసాగిన పాలకవర్గాలు తిరిగి మరోసారి ఎన్నిక కావాలన్న ఆశతో ఉన్నారు. జహీరాబాద్, సంగారెడ్డి, జోగిపేట, సదాశివపేట మున్సిపాలిటీల్లో మహిళలే చైర్‌పర్సన్లుగా కొనసాగారు. జరగబోయే ఎన్నికల్లో వారి భర్తలు ఆశలు పెంచుకుంటున్నారు. ఏదిఏమైనా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి జిల్లాలోని 8 మున్సిపాలిటీలను సాధించుకునేలా ముందుకు సాగుతోంది. జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అందరి కంటే ముందే మున్సిపాలిటీలో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. సుమారుగా రూ.10 కోట్ల విలువ చేసే పనులను చేపట్టేందుకు నిర్ణయించుకొని శంకుస్థాపనలు చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top