నియామకాలకు ఎన్నికలతో సంబంధం లేదు 

Police Recruitment are not associated with elections - Sakshi

     ఫిబ్రవరి నాటికి శిక్షణ ప్రారంభం 

      స్పష్టం చేసిన పోలీస్‌ శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు జరుపుతున్న నియామక ప్రక్రియకు ఎన్నికలతో ఏ సంబంధం లేదని పోలీస్‌శాఖ స్పష్టం చేసింది.  ప్రక్రియకు ఎన్నికలు ఆటంకమవుతాయంటూ వస్తున్న పుకార్లను అభ్యర్థులు నమ్మవద్దని  బోర్డు అధికారులు చెబుతున్నారు. ఎన్నికల బందోబస్తుకు పోలీస్‌శాఖ మొత్తం అదే పనిలో ఉండటం వల్ల దేహదారుఢ్య పరీక్షలు ఆగిపోవడం తప్పని, ప్రతీ జిల్లా ప్రధానకార్యాలయాల్లోనూ, కమిషనరేట్‌లోని సైనికాధికారులు ఈ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారన్నారు. నిర్ణీత తేదీల్లోనే ఈ పరీక్షలు నిర్వహించేలా కొంతమంది అధికారులకు బాధ్యతలు అప్పగించారు. డిసెంబర్‌లో ఎస్‌ఐ సంబంధిత విభాగాలకు మెయిన్స్‌ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటివారంలో పోలీస్‌ అకాడమీలో శిక్షణ ప్రారంభమయ్యేలా షెడ్యూల్‌ రూపొందించుకున్నట్టు తెలిపారు. కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ముందు ప్రకటించినట్లు ఈ నెల 30న జరుగుతుందని వెల్లడించారు. ఎస్‌ఐ పోస్టులకు ఫిజికల్‌ పరీక్షలు పూర్తయ్యేలోపు కానిస్టేబుల్‌ ఫిజికల్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. తుది పరీక్ష విçషయంలో కొంచెం సమయం పడుతుందని, శిక్షణకు అన్ని పోలీస్‌ శిక్షణ కేంద్రాలు, ట్రైనింగ్‌ కాలేజీలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. నియామక ప్రక్రియపై గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని, అంతా షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని వెల్లడించారు.  

ఐటీ ఎస్‌ఐ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల 
తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇటీవల నిర్వహించిన కమ్యూనికేషన్, ఐటీ సబ్‌ఇన్‌స్పెక్టర్, ఫింగర్‌ ప్రింట్స్‌ అసిస్టెంట్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఐటీ, కమ్యూనికేషన్‌ విభాగంలో 4,684(33.62%)మంది, ఫింగర్‌ ప్రింట్‌ విభాగంలో 3,276(42.58%)మంది అర్హత సాధించారు. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే ఫిజికల్‌ టెస్టులు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. అర్హత పొందిన అభ్యర్థులు మార్కులు, ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో యూజర్‌ఐడీ ద్వారా లాగిన్‌ కావాలని సూచించారు. ఫిజికల్‌ టెస్టులకు సంబంధించి పార్ట్‌–2 దరఖాస్తు ఫారాన్ని త్వరలో వెబ్‌సైట్‌లో ఉంచుతామని, సూచించిన సమయంలో సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top