ఈ పోలీసుల లెక్కే వేరు..!

Police Officials Not Obeying Orders Of Their Superiors About There Transffers In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : తామున్న ఠాణా వదిలేది లేదంటూ ఆ పోలీసులు తమ ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. క్రమశిక్షణకు పెద్దపీట వేసే పోలీసుశాఖలో ఇప్పుడీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గత నెలలోనే బదిలీలు జరిగినప్పటికీ తమ స్థానాల నుంచి కదలడం లేదు. పోలీసులు బదిలీలకు విముఖత చూపుతుండడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది.

బదిలీలకు ఆదేశాలు..
గత నెల 21న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సివిల్‌ పోలీసులైన పోలీస్‌ కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల బదిలీలకు ఆదేశాలు వెలవడ్డాయి. అంతకుముందు ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల ఎస్పీలు, మంచిర్యాల జిల్లా కిందకు వచ్చే రామగుండం సీపీలు ఆయా జిల్లాల్లోని పీసీలు, హెచ్‌సీలు, ఏఎస్సైల నుంచి బదిలీలకు దరఖాస్తులు ఆహ్వానించారు. అందులో ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు బదిలీపై వెళ్లేందుకు ప్రాధాన్యత క్రమంలో దరఖాస్తు చేసుకోవాలని అప్పట్లో పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.

ఆయా ఠాణాల్లో పోలీసు అధికారులకు    దరఖాస్తులను మరుసటి రోజులోగా సమర్పించాలని ఆదేశాలు రావడంతో అప్పట్లోనే పోలీసు సిబ్బందిలో హైరానా వ్యక్తమైంది. ఆ తర్వాత రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటీవ్‌ గ్రౌండ్స్‌లో ఉమ్మడి జిల్లాలో సుమారు 70 మంది వరకు బదిలీలు జరిగాయి. దీనికి సంబంధించి ఆయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుంచి ఇతర జిల్లాలకు పలువురిని బదిలీ చేశారు.

ఈ మేరకు ఆయా పోలీసులను సంబంధిత డీఎస్పీలు, ఎస్‌హెచ్‌వోలు, సీఐలు, ఎస్సైలు తక్షణం సంబంధిత పోలీసుస్టేషన్‌ నుంచి రిలీవ్‌ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన వారు సంబంధిత పోలీసు ఉన్నతాధికారికి జాయినింగ్‌ లెటర్‌ ఇవ్వాలని సూచించారు. ఇది జరిగి సుమారు 20 రోజులవుతున్నా ఇప్పటి వరకూ పోలీసులు తమ స్థానాల నుంచి రిలీవ్‌ కాలేదు. ఇప్పుడీ వ్యవహారం ఉమ్మడి జిల్లాలో పోలీసు శాఖలో చర్చనీయాశంగా మారింది. 

అసలు ఏం జరుగుతోంది..?
పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో ప్రస్తుతం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. బదిలీ వ్యవహారంలో పోలీసులు పట్టువీడనట్లు తెలుస్తోంది. ప్రధానంగా విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటి పోయినందున తాము వెళ్లలేమని పేర్కొన్నారని సమాచారం. 2016లో జిల్లా విభజన జరిగినప్పటికీ ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాలకు పలువురు పోలీసులను ఆర్డర్‌ టు సర్వ్‌ ద్వారా బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత మరో రెండు సార్లు బదిలీలు జరిగాయి. అయితే ఆర్డర్‌ టు సర్వ్‌ ద్వారా ఉమ్మడి జిల్లాలోనే బదిలీ అయిన వారు ప్రస్తుతం సొంత జిల్లాలకు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులను కలిసి మొరపెట్టుకుంటున్నారు. అయితే గత నెల జరిగిన బదిలీలకు సంబంధించి ఆదేశాలు వెలువడినా పోలీసులు బేఖాతరు చేయడం మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనన్న చర్చ జరుగుతోంది.

పరిశీలన జరిగిందా..!
జిల్లాల విభజనకు ముందే పలువురు పోలీసులు ఆయా ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకున్నారు. ప్రధానంగా కొన్నేళ్లుగా ఒకే దగ్గర పోస్టింగ్‌ ఉండడంతో ఆ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకుని స్థిరపడ్డారు. అయితే 2016లో జిల్లాల విభజనలో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలుగా మారాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖకు సంబంధించి జిల్లా పోలీసు అధికారి (డీపీవో) కార్యాలయాలు జిల్లా కేంద్రాల్లో ఏర్పాడ్డాయి. మంచిర్యాలకు సంబంధించి రామగుండం కమిషనరేట్‌ నుంచి కార్యకలాపాలు జరుగుతున్నాయి.

అప్పట్లోనే పోలీసులకు సంబంధించి సర్వీస్‌ బుక్‌లను ఆయా జిల్లాల వారీగా డీపీవో కార్యాలయాలకు తరలించారు. ప్రస్తుతం బదిలీల్లో సదరు పోలీసులు చదువుకున్న ప్రాంతానికి సంబంధించి బోనాఫైడ్‌ సర్టిఫికెట్, పోలీసు శాఖలో అతని సర్వీసుకు సంబంధించిన బుక్‌ను పరిశీలించి వారు ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతానికి చెందినవారైతే ఆ ప్రాంతానికి బదిలీ చేయాలని కొంత మంది డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఏళ్లుగా తమ సొంత ప్రాంతాన్ని విడిచి ప్రస్తుతం వేరే చోట స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారు బదిలీపై వెళ్లేందుకు సుముఖంగా లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలుస్తోంది. మరో పక్క ఆర్డర్‌ టు సర్వ్‌ ద్వారా కొంత మంది ఇతర జిల్లాలకు వెళ్లిన వారు మూడు సంవత్సరాలైనా తమ సొంత జిల్లాకు బదిలీ చేయకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top