అమ్మా..? నాయనమ్మా..?

Police Legal advice For Child In Banjara hills hyderabad - Sakshi

నాయనమ్మను వదిలి వెళ్లనని చిన్నారి మారం

తీసుకెళ్లేందుకు తల్లి పట్టు

న్యాయసలహా కోరనున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: కన్నపేగు గొప్పదా..? పెంచిన ప్రేమ గొప్పదా..? అన్నది తెలుసుకోనేందుకు అటు తల్లికి, ఇటు నాయనమ్మకు ఓ చిన్నారి పరీక్ష పెట్టాడు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. టోలిచౌకీకి చెందిన  సయ్యద్‌ గౌస్, ఫర్హీన్‌ సుల్తానా దంపతులకు సయ్యద్‌ సయీద్‌(4) కుమారుడు ఉన్నాడు. ఏడాదిక్రితం గౌస్‌ గుండెపోటుతో మృతి చెందడంతో చిన్నారి సయీద్‌ తన నాయనమ్మ నసీంబాను వద్దే పెరుగుతున్నాడు. భర్త మరణంతో పుట్టింటికి చేరుకున్న ఫర్హీన్‌ సుల్తానా గత కొంత కాలంగా తన కుమారుడిని తనకు అప్పగించాలని అత్తపై ఒత్తిడి తెస్తోంది. అయితే చిన్నారి సయీద్‌ మాత్రం తల్లిదగ్గరికి వెళ్లేందుకు ససేమిరా అంటూ నాయనమ్మ వద్దే ఉంటానని మొరాయిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఫరీన్‌ సుల్తానా తన కుమారుడిని అప్పగించాలంటూ కోరుతూ డీసీపీని ఆశ్రయించింది. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు గురువారం చిన్నారి సయీద్‌తో పాటు తల్లి ఫరీన్, నాయనమ్మ నసీంబానులను స్టేషన్‌కు పిలిపించారు. అక్కడ కూడా తాను నాయనమ్మ వద్దే ఉంటానంటూ చిన్నారి ఏడుస్తూనే తల్లిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. రెండు రోజుల్లో తన తండ్రి సంవత్సరీకం ఉందని అది అయిపోయాక వస్తానని అతను  ఏడుస్తున్నా తల్లి విన లేదు. ‘తమ్ముడు ఆయాన్‌ ఉన్నాడు కదా వాడిని చూసుకుంటూ ఉండు నేను నాయనమ్మతో ఉంటానంటూ’ తల్లిని ఒప్పించేందుకు శతవిధాల ప్రయత్నం చేశాడు. చిన్నారిని తల్లితో పంపాలా, నాయనమ్మకు అప్పగించాలా అన్న దానిపై న్యాయసలహా కోరనున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top