కొడుకులు బువ్వ పెట్టడం లేదని..

Police counseling for the sons of Elderly couple - Sakshi

     ఠాణా మెట్లెక్కిన వృద్ధ దంపతులు  

     నలుగురు కుమారులపై ఫిర్యాదు 

     కొడుకులకు పోలీసుల కౌన్సెలింగ్‌ 

వెల్గటూరు (ధర్మపురి): కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టడంలేదని, న్యాయం చేయాలని కోరుతూ ఓ వృద్ధ దంపతులు పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో బుధవారం జరిగింది. ఎస్‌ఐ మహేందర్‌ కథనం ప్రకారం.. మండలంలోని రాజారాంపల్లికి చెందిన బండ వెంకయ్య, రాజమ్మ దంపతులకు నలుగురు కుమారులు సంతానం. అందరికీ పెళ్లిళ్లు చేశారు. తమకున్న ఆస్తిని సమానంగా పంచి ఇచ్చారు. ఈ క్రమంలో వృద్ధాప్యం దరి చేరడంతో తల్లిదండ్రులను కొడుకులు నెలనెలా ఒకరు సాదాలని నిర్ణయించుకున్నారు.

కొన్నిరోజులుగా వీరిని ఏ కొడుకూ పట్టించుకోవడం లేదు. కనీసం బువ్వ కూడా పెట్టడంలేదని పేర్కొంటూ వెంకయ్య (75) బుధవారం ఠాణాకు చేరాడు. తమ చేతిలో చిల్లి గవ్వలేదని, తనకు వచ్చే పింఛన్‌పైనే ఇద్దరం కాలం వెళ్లదీస్తున్నామని వాపోయాడు. వృద్ధుడి బాధ విన్న ఎస్‌ఐ అతడి నలుగురు కుమారులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తండ్రి పేరిట ఉన్న 18గుంటల భూమిని ఎవరూ పంచుకోవద్దని హెచ్చరించారు. చేతనైనన్ని రోజులు ఇద్దరూ కలిసే ఉంటారని, ఆ తర్వాత కొడుకులందరూ తల్లిదండ్రులను తలా కొన్ని రోజులు సాకాలని సూచించారు. అనంతరం వృద్ధ దంపతులను ఓదార్చి ఇంటికి పంపించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top