ప్రేమించి పెళ్లి చేసుకొని పోషించలేక..

Police Caught Two Robbers in Shadnagar - Sakshi

జైలులో స్నేహం.. ఇరవైకి పైగా చోరీలు 

ఇద్దరు నిందితుల రిమాండ్‌  

5ద్విచక్ర వాహనాలు, వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం 

షాద్‌నగర్‌ పోలీసులను అభినందించిన డీసీపీ ప్రకాష్‌రెడ్డి 

శంషాబాద్‌: విలాసాల కోసం ఓ యువకుడు చోరీల బాటపట్టాడు.. ప్రేమించి పెళ్లి చేసుకుని కుటుంబాన్ని విలాసవంతంగా ఉంచాలనే ఉద్దేశంలో మరో వ్యక్తి అదే చోరీలను ఎంచుకున్నాడు.. వేర్వేరుగా  చోరీలు చేసి జైలు పాలైన ఇద్దరు స్నేహితులుగా మారి సుమారు ఇరవైకి పైగా వరుస చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను షాద్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి... షాబాద్‌ మండలం చర్లగూడెం గ్రామానికి చెందిన బాసుపల్లి ప్రవీణ్‌(27) పదవతరగతి వరకు చదువుకున్నాడు. విలాసవంతంగా బతకడానికి చోరీలనే మార్గంగా ఎంచుకున్నాడు. షాద్‌నగర్, కొత్తూరు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో పలు చోరీలు చేసి జైలుకు వెళ్లాడు. ఇదే సమయంలో మహబూబ్‌నగర్‌ పట్టణ షషాబ్‌గుట్ట ప్రాంతంలో నివాసముండే వడ్డె శేఖర్‌( 28) స్థానికంగా ఫొటోగ్రాఫర్‌గా పనిచేసే వాడు. ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన అతడి ఆదాయం చాలకపోవడంతో పాటు విలాసవంతంగా బతికేందుకు చోరీలు చేయడం ప్రారంభించాడు.

మహబూబ్‌నగర్‌ టౌన్‌తో పాటు కేశంపేట పరిధిలో పలు చోరీలకు పాల్పడి జైలుకెళ్లాడు. ప్రవీణ్, శేఖర్‌లు జైలులో స్నేహితులుగా మారారు. అక్కడి నుంచి వీరు మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 16 చోరీలకు పాల్పడ్డారు. దుకాణాల షట్టర్‌లు తొలగించడం చైన్‌ స్నాచింగ్, బైక్‌లు చోరీ చేయడం ప్రారంభించారు. రాచకొండ పరిధిలో ఒకటి, షాద్‌నగర్‌ 5 కేసులు నమోదయ్యాయి. సోమవారం షాద్‌నగర్‌లో చేపట్టిన వాహనాల తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించిన వీరిని షాద్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టి ఐదు ద్విచక్రవాహనాలు, 22.5 గ్రాముల బంగారం, 62 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. చోరీల్లో ప్రధాన నిందితుడైన ప్రవీణ్‌పై పీడీ యాక్టు నమోదు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.  కేసును ఛేదించిన షాద్‌నగర్‌ ఏసీపీ వి.సురేందర్, సీఐ సుధీర్‌కుమార్, డీఐ తిరుపతిని  డీసీపీ ఈ సందర్భంగా అభినందించారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top