విమానం అత్యవసర ల్యాండింగ్‌.. అయినా దక్కని పసివాడి ప్రాణం | Sakshi
Sakshi News home page

విమానం అత్యవసర ల్యాండింగ్‌.. అయినా దక్కని పసివాడి ప్రాణం

Published Wed, Aug 1 2018 12:25 AM

Plane emergency landing - Sakshi

హైదరాబాద్‌: నాలుగు నెలల చిన్నారి అస్వస్థతకు గురవ్వడంతో పట్నా వెళ్లే ఇండిగో విమానం శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. అయినప్పటికీ ఆ పసివాడి ప్రాణం మాత్రం దక్కలేదు. బిహార్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సందీప్‌కుమార్‌ తన భార్య పునీత్‌ శర్మతో కలసి బెంగళూరులో నివాసముంటున్నాడు. మంగళవారం ఉదయం పునీత్‌ శర్మ తన నాలుగు నెలల కుమారుడు స్పర్శ్‌తో కలసి బెంగళూరు నుంచి ఇండిగో 6ఈ837 విమానంలో పట్నాకు బయలుదేరింది.

ప్రయాణంలో స్పర్శ్‌ శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందికి గురికావడంతో ఆమె విమాన సిబ్బంది దృష్టికి తీసుకువచ్చింది. దీంతో పైలెట్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశారు. వెంటనే చిన్నారిని ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. పునీత్‌శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement