20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు
టాంపా: విమానం ఎత్తులో ఆకస్మిక తగ్గుదల కారణంగా ఒక్కసారిగా కుదుపులకు లోనై కనీసం 20మంది ప్రయాణికులు గాయపడ్డారు. గురువారం మెక్సికోలోని కాంకున్ నుంచి టేకాఫ్ తీసుకున్న జెట్‌బ్లూ సంస్థ ఎయిర్ బస్ విమానం న్యూజెర్సీలోని నెవార్క్ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, అమెరికాలోకి ప్రవేశించిన తర్వాత అకస్మాత్తుగా విమానం దిగువకు వచ్చింది.
కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. ప్రమాదాన్ని శంకించిన పైలట్ విమానాన్ని టాంపా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. గాయపడిన కనీసం 20 మంది ప్రయాణికులను వెంటనే ఆస్పత్రులకు తరలించారు. వీరెవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. కాగా, విమానంలో మొత్తం 162 సీట్లుండగా ప్రయాణికులెందరనే విషయంలో స్పష్టత లేదు.


