‘ఉపకారా’నికి టీ–వ్యాలెట్‌!

Pilot Project Got Positive Results At Nizamabad District - Sakshi

బ్యాంకు ఖాతా లేకున్నా స్కాలర్‌షిప్‌

నిజామాబాద్‌ జిల్లాలో ఫలించిన పైలట్‌ ప్రాజెక్టు

మరో 4 జిల్లాల్లో అమలుకు ప్రభుత్వం అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకారవేతన పథకానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి అనే నిబంధనకు కాస్త బ్రేక్‌ పడింది. బ్యాంకు ఖాతా తెరవడం, దాని నిర్వహణ తదితర అంశాలు విద్యార్థులకు కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాయనే ఆందోళన ఉండేది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీ–వ్యాలెట్‌ యాప్‌/ఆన్‌లైన్‌ సర్వీసు ద్వారా ఉపకారవేతనాలు పంపిణీ చేసేలా నిజామాబాద్‌ జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా గతేడాది అందుబాటులోకి తెచ్చింది.

ఈ జిల్లాలోని విద్యార్థులు ఉపకారవేతనం కోసం ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంకు ఖాతా నంబర్‌ బదులుగా టీ–వ్యాలెట్‌ బటన్‌ ను ఎంపిక చేసుకుంటారు. దరఖాస్తుదారు ఎంట్రీ చేసిన ఫోన్‌ నంబర్, విద్యార్థి పేరు ఆధారంగా టీ–వ్యాలెట్‌ రిజి స్ట్రేషన్‌ నంబర్‌ వస్తుంది. ఉపకారవేతనం విడుదలైన వెంటనే విద్యార్థి టీ–వ్యాలెట్‌ ఖాతాకు నిధులు జమవుతాయి. వీటిని సమీప మీ సేవా కేంద్రంలో విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. గతేడాది నిజామాబాద్‌ జిల్లాలో 32 వేల మంది విద్యార్థులు టీ–వ్యాలెట్‌ ఎంపిక చేసుకున్నారు.

మరో నాలుగు జిల్లాల్లో..
నిజామాబాద్‌ జిల్లాలో టీ–వ్యాలెట్‌ ప్రాజెక్టు సత్ఫలితాలివ్వడంతో మరో నాలుగు జిల్లాల్లో కూడా ఇదే తరహాలో ఉపకారవేతనాలు ఇవ్వాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల్లో టీ–వ్యాలెట్‌ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

వ్యాలెట్‌ ఆప్షన్‌ ఇస్తే మేలు..
ప్రస్తుతం ఉపకారవేతన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. అయితే వివరాల్లో తప్పులు, మార్పులు ఉంటే ఎడిట్‌ ఆప్షన్‌ ద్వారా సరిచేసుకోవచ్చు. నిర్దేశించిన 4 జిల్లాలకు సంబంధించి వెబ్‌సైట్‌లో టీ–వ్యాలెట్‌ ఆప్షన్‌ యాక్టివేట్‌ చేస్తే విద్యార్థులంతా బ్యాంకు ఖాతాకు బదులుగా టీ–వ్యాలెట్‌ వివరాలు సమర్పించవచ్చు. కొత్తగా నాలుగు జిల్లాల్లో టీ–వ్యాలెట్‌ అమలుపై అతి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్‌ ‘సాక్షి’తో పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top