రూ.2,200 కోట్లతో ‘గట్టు’ విస్తరణ! 

Penchikalapadu Reservoir Increased with capacity of 10 to 15 TMCs - Sakshi

10 నుంచి 15 టీఎంసీల సామర్థ్యంతో పెంచికలపాడు రిజర్వాయర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణాజలాలను వినియోగించుకుంటూ గద్వాల జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పథకాన్ని విస్తరించే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. జూరాల నుంచి రోజుకు అర టీఎంసీ నీటిని తీసుకుంటూ 30 రోజుల్లో కనీసంగా 15 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా దీన్ని రూపొందిస్తున్నారు. గతంలో ప్రతిపాదించిన 4 టీఎంసీల రిజర్వాయర్‌కు బదులుగా 10 నుంచి 15 టీఎంసీల సామర్థ్యంతో పెంచికలపాడు రిజర్వాయర్‌ నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. దీనికి రూ.2,500 కోట్లు వ్యయం అవుతుందని లెక్కగట్టారు. గద్వాల జిల్లాలోని గట్టు, ధారూర్‌ మండలాల పరిధిలోని 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టుకు గత ఏడాది జూన్‌లో సీఎం కేసీఆర్‌ ఈ పథకానికి శంకుస్థాపన చేశారు.

ఆ సమయంలో గట్టుకు అవసరమయ్యే 4 టీఎంసీల నీటిని రేలంపాడ్‌ రిజర్వాయర్‌ నుంచి తీసుకోవాలని భావించారు. అక్కడి నుంచి నీటిని తీసుకుంటూ 0.7 టీఎంసీల సామర్థ్యమున్న పెంచికలపాడు చెరువును నింపాలని, దీనికోసం అవసరమైతే దాని సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. తదనంతరం దీనిపై సమీక్షించిన సీఎం రేలంపాడ్‌కు బదులుగా నేరుగా జూరాల నుంచే నీటిని తీసుకోవాలని, రిజర్వాయర్‌ సామ ర్థ్యాన్ని సైతం పెంచాలని, ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

ఈ ప్రతిపాదనలకు అనుగుణం గా సర్వే చేసిన అధికారులు జూరాల నుంచి 15 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. నీటి నిల్వకోసం 10 నుంచి 15 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించాలని ప్రతిపాదిస్తుండగా, దీనికోసం 3,500 ఎకరాల భూసేకరణ అవసరమని గుర్తించారు. 160 మీటర్ల మేర నీటిని లిఫ్ట్‌ చేయనున్నారు. దీనికోసం రూ.2,500 కోట్లు వ్యయం అవుతందని అంచనా వేశారు. దీనిపై సమ గ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top