బాటసారికి బాసట!

Pedestrian Awareness Week in Hyderabad - Sakshi

ప్రమాద బాధితుల్లో రెండో స్థానం వీరిదే

నిరోధానికి నగర ట్రాఫిక్‌ పోలీసుల చర్యలు  

పెడస్ట్రియన్‌ అవేర్‌నెస్‌ వీక్‌ నిర్వహణకు నిర్ణయం

సాక్షి, సిటీబ్యూరో: ‘పెడస్ట్రియన్‌ ఈజ్‌ కింగ్‌ ఆఫ్‌ ది రోడ్‌’ ఈ అంతర్జాతీయ నానుడి నగరంలో మాత్రం అమలు కావట్లేదు. పాదచారులను ఎవరూ ‘పట్టించుకోకపోవడంతో’ నిత్యం ప్రమాదాల బారినపడుతున్నారు. నగరంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. గత ఏడాది నగరంలో జరిగిన ప్రమాదాల్లో బాధితులుగా మారిన వారిలో పాదచారులు 36 శాతానికి పైగా ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నగర ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదచారులతో పాటు వారి హక్కులపై వాహనచోదకుల్లోనూ అవగాహన పెంపొందించడానికి చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా ‘పెడస్ట్రియన్‌ అవేర్‌నెస్‌ వీక్‌’ పేరిట ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. త్వరలో వీటిని ప్రారంభించనున్నట్లు సిటీ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత...
నగర ట్రాఫిక్‌ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ జరుపుతారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారిపై గణాంకాల ఆధారంగా జాబితాలు రూపొందిస్తారు. 2018 గణాంకాల మేరకు నగరంలో చోటు చేసుకున్న ప్రమాదాలు రెండు వేలకు పైనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా... రెండో స్థానం పాదచారులదే. గత కొన్నేళ్లుగా నమోదైన గణాంకాల్లోనూ రోడ్డు ప్రమాద బాధితుల్లో పాదచారులే ఎక్కువగా ఉన్నారు. సిటీలో గత ఏడాది మొత్తం 2540 ప్రమాదాలు చోటు చేసుకోగా... 2550 మంది బాధితులుగా మారారు. వీటిలో ప్రమాదాలబారిన పడిన పాదచారుల సంఖ్య 924 మంది. మొత్తమ్మీద రోడ్డు ప్రమాద బాధితుల్లో 36 శాతం, మృతుల్లో 43 శాతం పాదచారులే ఉంటున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

నిబంధనలు, చట్టంపై అవగాహన...
పెడస్ట్రియన్‌ అవేర్‌నెస్‌ వీక్‌లో భాగంగా అందరిలో అవగాహన పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ట్రాఫిక్‌ చీఫ్‌ భావిస్తున్నారు. పాదచారుల భద్రతకు పెద్దపీట వేస్తూ చట్టంలోనే కొన్ని కఠిన నిర్ణయాలు ఉన్నాయి. సాధారణ పరిస్థితుల్లో వాహనం నడుపుతూ ఎక్కడైనా పాదచారిని ఢీ కొంటే అది బెయిలబుల్‌ కేసు. ఇలాంటి ప్రమాదాల్లో పోలీసులు స్టేషన్‌ నుంచే జామీనుపై పంపే అవకాశం ఉంటుంది. అదే జీబ్రా క్రాసింగ్‌పై పాదచారిని ఢీ కొన్న కేసుల్ని నాన్‌–బెయిలబుల్‌గా చట్టం పరిగణిస్తుంది. ఇలాంటి విషయాలు అనేక మంది వాహనచోదకులకు తెలియవు. ఫలితంగానే సిగ్నల్‌ వద్ద రెడ్‌లైట్‌ పడినప్పుడు, పాదచారులు జీబ్రా క్రాసింగ్‌ ద్వారా రోడ్డు దాటుతున్నప్పుడు దూసుకుపోతుంటారు. ఇలాంటి క్లిష్టమైన నిబంధనలు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ అవేర్‌నెస్‌ వీక్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వాహనచోదకులతో పాటు ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తున్న చిరు వ్యాపారాలు, బడా మాల్స్‌ తదితర వ్యాపార సంస్థలకూ ఫుట్‌పాత్‌ ఉద్దేశం, వాటిని ఆక్రమిస్తే తీసుకు నే చర్యలపై ప్రచారం చేయాలని  నిర్ణయించారు.  

పాదచారులకూ సూచనలు...
సిటీలో పాదచారులకు అవసరమైన మౌళిక వసతుల కొరత ఉన్నది వాస్తవమేనని పోలీసులే అంగీకరిస్తున్నారు. జనాభాకు అవసరమైన స్థాయిలో కాలిబాటలు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, సబ్‌–వేలు, పెలికాన్‌ సిగ్నల్స్‌ లేనప్పటికీ ఉన్న వాటినీ పాదచారులు వినియోగించుకోవట్లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ అవేర్‌నెస్‌ వీక్‌లో భాగంగా ఫుట్‌పాత్‌లు కేవలం పాదచారులు నడవడానికి మాత్రమే అనే దానిపై పెడస్ట్రియన్స్‌కూ అవగాహన కల్పించడంతో పాటు అది కచ్చితంగా అమలు అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పెడస్ట్రియన్లు సైతం ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటేందుకు ప్రయత్నించి ప్రమాదాల బారినపడకుండా చేయాలని యోచిస్తున్నారు. రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్స్‌ లేదా పెలికాన్‌ సిగ్నల్స్‌ ఉన్న ప్రాంతాలనే ఎంచుకునేలా ప్రచారం చేయనున్నారు. ఐటీఎంఎస్‌ ప్రాజెక్టులో భాగంగా పాదచారుల కోసం సిగ్నలింగ్‌ వ్యవస్థలో అందుబాటులోకి వస్తున్న విధానం, ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ల వినియోగం తదితరాల పై అవగాహన కల్పించనున్నారు.  

పాదచారుల భద్రతే లక్ష్యం
ఏటా నగరంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న పాదచారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. జీహెచ్‌ఎంసీ అధికారుల సహకారంతో ఇప్పటికే కొన్ని కీలక చర్యలు తీసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో పాదచారుల మరణాలను కొంత వరకు తగ్గించగలిగాం. సిటీలో వీలున్నంత వరకు పెడస్ట్రియన్‌ యాక్సిడెంట్స్‌ లేకుండా చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగానే అవేర్‌నెస్‌ వీక్‌ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాం. దీని విధి విధానాలను మరో వారంలో ఖరారు చేసిత్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం.      – అనిల్‌కుమార్, సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top