ప్రజల కోసమే పాస్‌పోర్ట్‌ సేవలు

Passport services are for people - Sakshi

విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

నల్లగొండలో పాస్‌పోర్ట్‌ సేవా కార్యాలయం ప్రారంభం

నల్లగొండ : ఉమ్మడి జిల్లా ప్రజల ప్రయోజనం కోసమే నల్లగొండలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న పాత ఆర్డీఓ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు కార్యాలయాన్ని రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా ప్రజల ఇబ్బందులను గమనించి జిల్లా కేంద్రంలో పాస్‌పోర్టు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషిచేసిన ఎంపీ గుత్తాకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం కాలంలో పాస్‌పోర్టు ప్రతిఒక్కరికి అవసరమన్నారు. గతంలో పాస్‌పోర్టు పొందేందుకు హైదరాబాద్‌ వెళ్లాల్సి వచ్చేదని.. ఇప్పుడావసరం లేదన్నారు. ఎంపీ గుత్తా మాట్లాడుతూ.. నా హయాంలోనే నల్లగొండలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ మాట్లాడుతూ పాస్‌పోర్టు సేవలను ఉమ్మడి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాస్‌పోర్టు సర్వీసెస్‌ బోర్డు మెంబరు ఉషా చంద్రమోహన్‌ మాట్లాడుతూ ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

సమావేశంలో ఎస్పీ ఏవీ రంగనాథ్, ఆర్డీఓ వెంకటచారి, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎంపీపీ పాశం రాంరెడ్డి, రీజనల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ ఎం.ఎలీషా, చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top