ఇంట్లో నుంచి తల్లిదండ్రుల గెంటివేత

Parental displacement from home - Sakshi

పోలీసుల జోక్యంతో ఇంటికి తీసుకెళ్లిన కుమారులు

మద్దిరాల: నవమాసాలు మోసి.. కని,పెంచి.. ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను కుమారులు ఇంటి నుంచి గెంటివేశారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని పోలుమల్ల గ్రామంలో ఆదివారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన దేవులపల్లి వీరయ్య రాములమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు దేవులపల్లి వెంకన్న, లింగయ్య. పెద్ద కుమారుడు వెంకన్న గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. చిన్నకుమారుడు లింగయ్య హైదరాబాద్‌లో పెయింటింగ్‌ పని చేస్తూ.. అక్కడే ఉంటున్నాడు. గ్రామంలో కుమారులు ఇద్దరూ ఇళ్లు నిర్మించుకున్నారు.

చిన్న కుమారుడు లింగయ్య హైదరాబాద్‌లో ఉండటంతో అతని ఇంట్లో తల్లిదండ్రులు ఉంటూ పింఛన్‌తో కాలం వెల్లదీస్తున్నారు. కొద్దిరోజులుగా అన్నదమ్ముల నడుమ తగాదాలు జరుగుతుండడంతో చిన్నకుమారుడు తన ఇంట్లో ఉండవద్దని తల్లిదండ్రులను బయటికి గెంటివేశాడు. దీంతో ఆ వృద్ధ దంపతులు వీధిన పడ్డారు. స్థానికులు ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారికి నచ్చజెప్పడంతో ఆ దంపతులను ఇంట్లోకి తీసుకెళ్లారు. కుమారులిద్దరికీ సోమవారం స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తామని ఎస్‌ఐ మగ్దూమ్‌ అలీ తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top