సాక్షి, రంగారెడ్డి జిల్లా : పల్లెల్లో అంతర్గత దారుల ముఖచిత్రం సమూలంగా మారనుంది. మురుగు నీరు, చెత్తాచెదారంతో కంపుకొడుతున్న గ్రామాల్లో సీసీ రోడ్లు వేసేందుకు కసరత్తు మొదలైంది. మండలాల వారీగా సీసీ రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా 602 పనులకుగాను కలెక్టర్ రఘునందన్‌రావు తాజాగా ఆమోదం తెలిపారు. వీటిని నిర్మించేందుకు రూ.21.55 కోట్లు కేటాయించారు. ఆరు నియోజకవర్గాల పరిధిలోని 19 మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ఏడాది మార్చి 31లోపు పనులు పూర్తి చేయాలని యంత్రాంగం లక్ష్యం నిర్దేశించుకుంది. ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరానికి ముందుగానే నిర్మాణ పనులను ముగించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది.
90 శాతం ‘ఉపాధి’ నిధులు
కేటాయించిన నిధుల్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద 90 శాతం నిధులను గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారానే విడుదల చేయనున్నారు. కూలీల వేతనాలు, సిమెంట్, ఇసుక, కంకర తదితర నిర్మాణ సామగ్రికి ఉపాధి నిధులు చెల్లించనున్నారు. మిగిలిన పది శాతం నిధులను నియోజకవర్గ అభివృద్ధి ప్రోగ్రాం (సీడీపీ), ఎంపీలాడ్స్, జెడ్పీ నుంచి ఖర్చు చేయనున్నారు.
| నియోజకవర్గం | మంజూరైన పనులు |
కేటాయింపులు (రూ.కోట్లలో) |
| చేవెళ్ల | 105 | 2.67 |
| ఇబ్రహీంపట్నం | 184 | 6.67 |
| మహేశ్వరం | 52 | 2.22 |
| షాద్‌నగర్ | 140 | 5.55 |
| రాజేంద్రనగర్ | 15 | 1.11 |
| కల్వకుర్తి | 106 | 3.33 |


