నెల 25వ తేదీ కల్లా ఎన్నికల ప్రక్రియ ముగించే యోచన
సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం
డెడికేటెడ్ కమిషన్ నివేదిక, రిజర్వేషన్ల ఖరారు తర్వాత ఎన్నికల నోటిఫికేషన్
కేంద్రం నుంచి రూ. 4 వేల కోట్ల నిధులు తెచ్చుకోవడంపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరపాలన్న దానిపై ఈ నెల 25న జరగనున్న కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో.. ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో డిసెంబర్‌లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడంతో..ఆ మేరకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ నెల 30వ తేదీలోగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ద్వారా షెడ్యూల్ విడుదలైన పక్షంలో, వచ్చే నెల 25 తేదీ కల్లా మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ద్వారా 50 శాతం రిజర్వేషన్లపై నివేదిక తయారుచేసి సర్కార్‌కు అందజేయాల్సి ఉంది. ఇందుకు రెండు,మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
ప్రభుత్వం దానిని పరిశీలించి గ్రీన్‌సిగ్నల్ ఇస్తుంది. ఆ తర్వాత 25న జరగనున్న మంత్రివర్గ భేటీలో దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ నిర్ధారించిన రిజర్వేషన్ల ఫార్ములా (ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల శాతం)కు అనుగుణంగా, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 31 జిల్లాల్లో పంచాయతీలు, వార్డు స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది.
అలాగే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టతనిస్తూ ఎస్‌ఈసీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
రెండేళ్ల ఉత్సవాలకు ఆటంకం!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీ నాటికి రెండేళ్లు పూర్తవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో వచ్చే నెల 1–9 తేదీల మధ్య ప్రజాపాలనా వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. కాగా ఈ నెలాఖరులోగానే ఎస్‌ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేసిన పక్షంలో అన్ని గ్రామీణ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. దీంతో వారోత్సవాల పేరిట జిల్లాల్లో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించే వీలుండదు.
అదే జరిగితే వచ్చేనెల 9వ తేదీ తర్వాతే షెడ్యూల్ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరు లేదా జనవరి మొదటివారం వరకు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగవచ్చునని అధికారులు చెబుతున్నారు. అలా కాకుండా వచ్చే నెల 8, 9 తేదీల్లో ఎన్నికల కోడ్ అమల్లో లేని హైదరాబాద్‌లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తే అసలు ఏ సమస్య ఉండదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
మరోవైపు అధికారికంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రెండేళ్ల ఉత్సవాలను నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయమూ వినిపిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పారీ్టల గుర్తులపై జరగనందున ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదని అంటున్నారు. గత 21 నెలలుగా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన దాదాపు రూ.4 వేల కోట్లు నిలిచిపోయినందున సత్వరమే పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
అందువల్ల మరింత ఆలస్యం చేయకుండా డిసెంబర్ చివర్లోగా అంతగా కాకపోతే జనవరి మొదటి వారంలోగా మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కృత నిశ్చయంతో సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది.


