
ఆవేదనలో కంప్యూటర్‌ఆపరేటర్లు, ఎంపీడబ్ల్యూ,ఓపీఎస్‌లు
మూడు నెలలుగావేతనాల్లేక అప్పుల బతుకులు
ఇటీవల తుంగతుర్తిలోఓ పంచాయతీ ఆపరేటర్‌ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఇ–పంచాయతీ ఆపరేటర్‌గా పనిచేసే సోమిరెడ్డి రెండు నెలల కిందటడిప్యుటేషన్‌పై సూర్యాపేట డీపీవో కార్యాలయానికి వెళ్లాడు. ఇద్దరు కూతుళ్లు, భార్యతో కలిసి నల్లగొండలో ఉంటున్న ఆయన నిత్యం సూర్యాపేటకు వచ్చి పోయేవారు.
భార్యాపిల్లలను పోషించుకునేందుకు వచ్చే జీతమే తక్కువకాగా,అదీ రెండు మూడు నెలలపాటురాకపోవడంతో తీవ్ర ఆందోళనకుగురయ్యాడు. దీనికి ఆరు నెలలకిందట జరిగిన ప్రమాదం తర్వాతమరింత కుంగిపోయాడు. ఈ క్రమంలోనే తన బాధను ప్రకటిస్తూ, ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక పోతున్నాననిపేర్కొంటూ తన స్నేహితుల గ్రూపులో మెసేజ్ పెట్టి రైలు కింద పడిఆత్మహత్య చేసుకున్నాడు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పనిచేసే సిబ్బంది వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 55వేల మంది వేతనాల కోసం విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. మండల పరిషత్ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే 1,579 మంది ఇ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు జూలై నుంచి వేతనాలు లేక ఇబ్బందులు పడుతుండగా, 1,093 మంది ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు (ఓపీఎస్), 52,473 మంది గ్రామాల్లో పనిచేసే మల్టీ పర్పస్ వర్కర్స్‌కు (ఎంపీడబ్ల్యూ) జూలై నుంచి వేతనాలు అందకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. పండుగ పూట కూడా పస్తులు ఉండాలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాలు రాక అప్పుల పాలు
ప్రతి నెలా వేతనాలు అందకపోవడంతో గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేసే సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంట్లో అవసరాలు, ఏదైనా కొనాలన్నా చేతిలో డబ్బుల్లేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రతిసారి అప్పులు చేసేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని, చివరకు అప్పు కూడా లభించక, కుటుంబపోషణ భారంగా మారి తీవ్ర మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఉద్యోగ భద్రత లేక..గ్రీన్ చానల్‌లో వేతనాలు అందక..
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరి«ధిలో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఎలాగూ లేదని వాపోతున్నారు. 10 ఏళ్ల కిందటి నుంచే తాము పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత కల్పించడం లేదని చెబుతున్నారు. గ్రామంలో, మండలంలో ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ సర్వే చేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన వివరాలనైనా ఇ–పంచాయతీ ఆపరేటర్లే ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. తమ ఉద్యోగానికి ఫలానా సమయమంటూ లేదని, ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు పనిచేస్తున్నా తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
ఓపీఎస్‌లు, ఎంపీడబ్ల్యూలు కూడా తాము ఎంత పనిచేసినా ఉద్యోగ భద్రత లేక మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు గ్రీన్ చానల్‌లో వేతనాలను ప్రతి నెలా ఇస్తామని మంత్రి సీతక్కతో సహా ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చినా కనీసం దానిని అమలు చేయడం లేదని వాపోతున్నారు.
పండుగ వచ్చి నా పస్తులే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని, ఇంట్లో పిల్లలకు కనీసం కొత్త బట్టలు కొనలేని దుస్థితిలో మనుగడ సాగించాల్సి వస్తో్తందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమ వేతనాలను విడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.