‘పంచాయతీ’పై నజర్‌

Panchayat Elections First Phase Nominations Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌:  శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన తెలంగాణ రాష్ట్ర సమితి పంచాయతీల్లో సత్తా చాటేందుకు తహతహలాడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 1,503 పంచాయతీలకు ఈసారి ఎన్నికలు జరుగుతుండగా, టీఆర్‌ఎస్‌ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వ్యూహాత్మకంగా సాగుతున్నారు. మూడు విడతలుగా సాగే ఈ పోరులో తొలి విడత 21న జరిగే ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం బుధవారంతో ముగిసింది.

తొలి విడతలో 511 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, వీటిలో కొన్ని ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఒకరి కన్నా ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసినా, గురువారం జరిగే స్క్రూటినీ తర్వాత మిగిలిన అభ్యర్థులను ఉపసంహరింప జేసేందుకు ప్రతీ నియోజకవర్గంలో గ్రామాల వారీగా అధికార పార్టీ నేతలు బృందాలను ఏర్పాటు చేశారు. 25, 30 తేదీల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు గడువు మిగిలి ఉండడంతో ఇప్పటికే పోటీలో నిలబడే ఆలోచనతో ఉన్న అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

మొదట సొంత పార్టీ నుంచే     బుజ్జగింపుల పర్వం 
గ్రామస్థాయిల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం పెరగడంతో తాజా మాజీ సర్పంచులతోపాటు ఆ పదవి కోసం పోటీ పడే నాయకులు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శాసన సభ్యులు, మండలస్థాయి ముఖ్య నాయకులు రంగంలోకి దిగి గ్రామాల వారీగా గెలిచే అవకాశం ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకులను, తమకు అనుకూలమైన వ్యక్తులను ఎంపిక చేసుకున్నారు. అదే సమయంలో పోటీలో ఉండాలని భావిస్తున్న మిగతా ఒకరిద్దరు టీఆర్‌ఎస్‌ స్థానిక నాయకులను బుజ్జగించే కార్యక్రమం సాగిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సహకార సంఘం డైరెక్టర్‌ పదవులను ఆశ చూపుతూ తాము మద్దతిస్తున్న సర్పంచ్‌ అభ్యర్థికి అడ్డులేకుండా పావులు కదుపుతున్నారు. అయినా తొలి విడత ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేసిన పార్టీకి చెందిన ఇతర నాయకులను స్క్రూటినీ తరువాత నామినేషన్‌ ఉపసంహరించుకునేలా ఇప్పటి నుంచే ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

పంచాయతీకి రూ.10లక్షల నజరానా.. తప్పుకుంటే ఇంకొంత 
ఏకగ్రీవ పంచాయతీలకు సర్కారు ప్రకటించిన రూ.10లక్షల నజారానాను గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయవచ్చంటూ సొంత పార్టీలోని నాయకులకు నచ్చ చెపుతున్నారు. గట్టిపోటీ ఇచ్చే సొంత పార్టీలోని మరో నాయకుడు ఉంటే.. అతనికి వ్యక్తిగత నజరానా ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం. పోటీ నుంచి తప్పుకుంటే పెద్ద మొత్తంలో ఇప్పించే కార్యక్రమం కూడా సాగుతోంది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్, నిర్మల్, ఆదిలాబాద్‌ నియోజకవర్గాల్లో ఈ తరహా బుజ్జగింపులు సాగుతున్నాయి.

అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులపై కూడా అధికార పార్టీ నజరానాల అస్త్రం ప్రయోగిస్తున్నట్లు ప్రచా రం సాగుతోంది. తండాలుగా మారిన కొత్త పంచాయతీలు మినహా ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉంటే అక్కడి జనాభాను బట్టి ఒక్కొక్కరు కనీసం రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న ప్రత్యర్థిని మధ్యవర్తుల ద్వారా మచ్చిక చేసుకొని బేరాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. పోటీ నుంచి విరమించుకుంటే ఖర్చు తప్పడంతోపాటు ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ పొందే అవకాశాలను వివరిస్తున్నారు. తొలివిడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయితే నజరానాలు, రిటర్న్‌ గిఫ్ట్‌ల బాగోతాలు వెల్లడవుతాయి.
 
ఎమ్మెల్యేలకు తొలి పరీక్ష 
రెండోసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 8 మంది శాసనసభ్యులతో పాటు చెన్నూరు నుంచి గెలిచిన బాల్క సుమన్‌ పంచాయతీ ఎన్నికలతో తొలి పరీక్ష ఎదుర్కొబోతున్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని దాదాపు అన్ని పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌కే మెజారిటీ వచ్చింది. నిర్మల్, ముథోల్, ఖానాపూర్, సిర్పూరు, ఆదిలాబాద్‌లలో కూడా దాదాపు అదే పరిస్థితి. మెజారిటీ వచ్చిన పంచాయతీల్లో ఏకగ్రీవం ద్వారా సర్పంచులను ఎన్నుకొని, గట్టి పోటీదారుడు ఉంటే వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై ఉప సర్పంచి పదవి పొందేలా పావులు కదుపుతున్నారు. ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఏకగ్రీవాలైతే అధిష్టానం వద్ద అనుకూల పరిస్థితి ఉంటుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ప్రభుత్వంలో మంత్రి, లేదా పార్లమెంటరీ కార్యదర్శి తదితర మెరుగైన పదవి దక్కాలంటే పంచాయతీల్లో సత్తా చాటాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.  

కాంగ్రెస్‌కు మెజారిటీ ఇచ్చిన  గ్రామాలపైనా కన్ను 
మంచిర్యాల, ఆసిఫాబాద్, బోథ్‌ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌తో పోటీగా పంచాయతీల్లో కాంగ్రెస్‌ పార్టీకి మెజారి టీ లభించింది. ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌ పార్టీనే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో మంచిర్యాల, బోథ్‌ ఎమ్మెల్యేలు తమకు మెజారిటీ రాని గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా గ్రామాల్లో బలమైన నాయకుల ను బరిలో నిలిపి పంచాయతీని కైవసం చేసుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ నాయకులను కూడా తమవైపు తిప్పుకొని ఏకగ్రీవంగా లేదా టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థికి అనుకూలంగా ఓటింగ్‌ జరిగేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆసిఫాబాద్‌ లో కాంగ్రెస్‌ గెలిచినప్పటికీ, పలు కార ణాలతో ఎమ్మెల్యే ఆత్రం సక్కు పంచా యతీ ఎన్నికల కోసం ఇప్పటి వరకు గ్రామాల్లో తిరగలేదు.

అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అభ్యర్థుల ఎంపిక, ఏకగ్రీవాలపై దృష్టి పెడుతున్నా రు. రెండు, మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండడంతో టీఆర్‌ఎస్‌కు అను కూల ఓటింగ్‌ జరిపేందుకు మాజీ ఎమ్మె ల్యే కోవ లక్ష్మి కృషి చేస్తున్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్‌ నాయకులు 90 శాతం మంది బీఎస్పీకి అనుకూలంగా వ్యవహరించగా, పలు గ్రామాల్లో బీఎస్పీ అభ్యర్థి గడ్డం వినోద్‌కు మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బీఎస్పీకి మెజారిటీ ఇచ్చిన గ్రామ సర్పంచులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా శుక్రవారం నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతుంది. రెండో విడతలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 489 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top