పీయూకు నిధుల కేటాయింపు అరకొరే 

Palamuru University Facing Lack Of Funds In Mahabubnagar - Sakshi

ఎక్కడికక్కడ ఆగిన అభివృద్ధి పనులు

రూ.119 కోట్లకు ప్రతిపాదలను పంపిస్తే ఇచ్చింది రూ.6.63 కోట్లే

సాక్షి, మహబూబ్‌నగర్‌ : ప్రస్తుతం పాలమూరు యూనివర్సిటీ పరిధిలో వివిధ అభివృద్ది పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొత్త భవనాల నిర్మాణం, సదుపాయాల కల్పన, కొత్త కోర్సుల ఏర్పాట్లు, పీజీ కళాశాలలు, హాస్టళ్ల నిర్మాణానికి నిధులు అవసరం. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ పనులకు రూపాయైనా కేటాయించలేదు. కేవలం శాశ్వత ప్రతిపాదికన పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు ఇచ్చేందుకు మాత్రమే రూ.6.63 కోట్లు మంజూరు చేసింది. కాగా తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న వారికి వేతనాలను పీయూకి వచ్చే ఆర్థిక వనరుల నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.  

రూ.119 కోట్లతో ప్రతిపాదనలు
వివిధ అభివృద్ధి పనులు, సిబ్బంది వేతనాలను దృష్టిలో ఉంచుకుని పీయూ అధికారులు మొత్తం రూ.119 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వానాకి గతంలోనే ప్రతిపాదనలు పంపించారు. ఇందులో రూ.85 కోట్లు పీయూతో పాటు అనుబంధ పీజీ సెంటర్లలో కొనసాగుతున్న పనులకు కావాలని విన్నవించారు. మిగతా రూ.25 కోట్లు పీయూలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలకు అవసరమని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత బడ్జెట్‌లో రూ.6.63 కోట్లను మాత్రమే కేటాయించింది. 

వచ్చే ఆరు నెలల వరకు కొత్త పనులు ప్రారంభించేందుకు అవకాశం లేకుండా పోయింది. అంతేగాక గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేటాయించిన బడ్జెట్లో పూర్తిస్థాయిలో నిధులను ఇంకా విడుదల చేయలేదు. దీంతో వివిధ అభివృద్ధి పనుల అంచనాలు తలకిందులయ్యాయి. అంతేగాక గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన పలు పనులు పూర్తికాని పరిస్థితి నెలకొంది.  

అభివృద్ధి ప్రశ్నార్థకమే..
పాలమూరు యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిధులను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. చివరకు అభివృద్ధి పనులు ప్రశ్నార్థకంగా మారాయి. రెండేళ్ల నుంచి పరీక్షల విభాగం భవనం, వీసీ రెసిడెన్సీ, గెస్టుహౌస్‌ నిర్మిస్తున్నారు. వీటి కోసం రూ.17 కోట్లు కేటాయించినా అందులో ఇంకా నిధులు రావాల్సి ఉంది. ఇక పీయూలో చదువుతున్న బాలికలకు కేవలం ఒకే హాస్టల్‌ మాత్రమే ఉంది. విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా మరోటి నిర్మించాలని, విద్యార్థులకు ప్రత్యేక ఆస్పత్రి, మరిన్ని కోర్సులు ప్రారంభించాలంటే కొత్త కళాశాలల భవనాలు అవసరం.

గద్వాల, కొల్లాపూర్‌ జీపీ సెంటర్లను బలోపేతం చేసేందుకు ఎక్కడిక్కడ శాశ్వత భవనాలు నిర్మించాలని గ తంలో అధికారులు రూ.ఎనిమిది కోట్లతో ప్రతి పాదనలు చేశారు. ముఖ్యంగా కళాశాల భవనాలు, బాలబాలికలకు ప్రత్యేక హాస్టళ్లు అవసరం. ఈ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.

నిధులు వస్తేనే అభివృద్ధి సాధ్యం 
మిగతా యూనివర్సిటీలతో పోల్చితే పీయూకు ఆదాయ వనరులు తక్కువ. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే వసతుల కల్పన చాలా ముఖ్యం. అందుకు మరిన్ని నిధులు కేటాయిస్తేనే త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తవుతాయి. 
– కుమారస్వామి, పీయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినర్‌

అంతర్గత నిధులు కేటాయిస్తాం 
రాష్ట్ర బడ్జెట్‌లో కొత్త యూనివర్సిటీలకు నిధులు తక్కువ కేటాయించడంతో భవనాల నిర్మాణం, కొత్త కోర్సుల ఏర్పాటు, ఇతర వసతుల కల్పనపై ప్రభావం పడుతుంది. విద్యార్థులకు క్వాలిటీ, ఇన్నోవేటివ్‌ విద్య, న్యాక్‌లో ఉన్నతమైన గ్రేడింగ్‌ కోసం వసతులు కల్పించడం చాలా అవసరం.  కొత్త యూనివర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్‌ ఇవ్వాలి. ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు పీయూ అంతర్గత నిధులు కేటాయిస్తాం. 
– పిండి పవన్‌కుమార్, పీయూ రిజిస్ట్రార్‌     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top