సీసీఎంబీ పరిశోధనలో గొప్ప ముందడుగు  

Paddy Seeds Without Affecting Bacteria By CCMB - Sakshi

హైదరాబాద్‌: వరి.. దేశంలోనే అతి ముఖ్యమైన పంట. వరి పంట వేసిన తర్వాత అది చేతికందే లోపు అనేక రకాల బ్యాక్టీరియాలు దాడి చేసి రైతుకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వరిని పట్టిపీడిస్తున్న వాటిలో జాంతోమోనాస్‌ ఒరిజే అనే బ్యాక్టీరియా ఒకటి. ఇది సోకడం వల్ల దేశంలోని రైతులు 60 శాతం పంటను నష్టపోతున్నారు. ఈ బ్యాక్టీరియా తెగులు నుంచి వరి పంటను కాపాడేందుకు గాను హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు డాక్టర్‌ హితేంద్రపటేల్, డాక్టర్‌ రమేష్, సోహినీదేవ్‌లు  అధ్యయనం నిర్వహించారు. జాంతోమోనాస్‌ బ్యాక్టీరియాలోని జోప్‌– క్యూ అనే ఎంజైమ్‌ వరి పంట నష్టానికి కారణమని గుర్తించారు. జోప్‌– క్యూ వరి మొక్క కణాలపై దాడి చేసి మొక్క కణకవచాన్ని బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తుంది. రోగనిరోధక శక్తి కలిగిన మాలిక్యూల్స్‌ను టార్గెట్‌ చేసి వాటిని నిర్వీర్యం చేయడానికి వాటిపై దాడి చేస్తుంది.  

ప్రోటీన్‌ దిశను మార్చి... 
కణాల మీద బ్యాక్టీరియా దాడి చేసినపుడు మొక్కలోని రక్షిత వ్యవస్థకు, సూక్ష్మక్రిమికి మధ్య జరిగే పోరాటంలో మొక్క తనను తాను కాపా డుకుంటే రక్షించబడుతుంది. లేదంటే వ్యాధి బారిన పడుతుంది. అయితే   బ్యాక్టీరియాదే పైచేయిగా నిలవడంతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లు తూ వస్తోందని చెప్పారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు వరి మొక్కలో వ్యాధికి కారకంగా మారిన ప్రోటీన్‌ అనుక్రమాన్ని ఒక దశ వద్ద మార్చివేశారు. రోగనిరోధక శక్తి కలిగి వ్యాధి బారిన పడుతున్న 14–3–3 అనుక్రమం కలిగిన ప్రోటీన్‌ దిశలో మార్పు చేయడం వల్ల బ్యాక్టీరియా దాడి ప్రభావం చూపలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రోటీన్‌ దిశను మార్చడం వల్ల వరి మొక్కకణాలను నాశనం చేసే బ్యాక్టీరియల్‌ హైజాక్‌ను అడ్డుకోవడంతో పాటు మొక్క కణజాలంలో రక్షణ సంబంధ ప్రతిచర్యలను పటిష్టపర్చడం కూడా సాధ్యపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top