అక్రమాల బాలసదన్‌..! | Sakshi
Sakshi News home page

అక్రమాల బాలసదన్‌..!

Published Sun, Nov 11 2018 9:37 AM

Orphaned Children Orphanages In Karimnagar - Sakshi

మంకమ్మతోట(కరీంనగర్‌): అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని.. విద్యాబుద్దులు చెప్పించి వారి జీవితాల్లో వెలుగు నింపాల్సిన బాలసదన్‌ అక్రమాల పుట్టగా మారింది. జిల్లాకేంద్రంలోని క్రిస్టియన్‌ కాలనీలో ఐసీడీఎస్‌ పరిధిలో నడుస్తున్న బాలసదన్‌ అధికారులు పిల్లల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా ఏటా బాలల వారోత్సవాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. అనాథ బాలలు ఉంటున్న బాలసదన్‌లు, ఆ శాఖ అధికారుల పనితీరుపై మాత్రం దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం బాలసదన్‌లో ఉంటున్న బాలల పట్ల సంరక్షణ కరువై రోగాలపాలవుతున్నారు. ప్రభుత్వం ఏటా బాలసదన్‌ నిర్వహణకు కాస్మోటిక్‌ చార్జీల పేరుతో రూ.కోట్లు కేటాయిస్తున్నా.. పిల్లలకు చేరడం లేదు. వారి పరిశభ్రత పట్ల అధికారులు శ్రద్ధ తీసుకోకపోవడంతో చర్మవ్యాధులు, ఇతర  రోగాలతో సతమతమవుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

జిల్లాకేంద్రంలోని బాలసదన్‌లో 30మంది అనాథ పిల్లలు ఆశ్రయం ఉంటున్నారు. వీరికి ఆశ్రయం కల్పించడంతోపాటు విద్యాబుద్దులు నేర్పించి మంచి పౌరులుగా తీర్చి దిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడ పనిచేస్తున్న అధికారి బాలల సంరక్షణ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆ శాఖ సిబ్బంది బాహాటంగా ఆరోపిస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు,  ఆవిర్భావ దినోత్సవాలతోపాటు నాయకులు, సినీ నటుల ఫ్యాన్స్‌ వేడుకలను బాలసదన్‌లో జరుపుకునేందుకు వస్తుంటారు.

వీరంతా పిల్లల మధ్య వేడుకలు జరుపుకొని  స్వీట్లు, పండ్లు, ఆట వస్తువులు, దుస్తులు, దుప్పట్లు, బియ్యం, పప్పులు వంటివి పంపిణీ చేయడంతోపాటు వారందరికి ఉపయోగపడే వస్తువులు ఫ్యాన్లు, కూలర్లు, గీజర్లు, వాషింగ్‌ మిషన్లు వంటివి కానుకలుగా ఇస్తుంటారు. మరికొంత మంది  అవసరమైన వాటిని కొనుక్కోవాలని విరాళాలు అందిస్తుంటారు. ఇలా దాతలు ఇచ్చిన నగదుకు లెక్కలు ఉండకపోగా.. వస్తువులు మాయం అవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దాతలు ఇచ్చిన వాటిలో చాలావరకు కనిపించకపోగా.. మరికొన్ని కొత్తవాటిస్థానంలో పాతవి దర్శనం ఇస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. చెడిపోయిందని మూలనపెట్టి కొద్ది రోజుల తర్వాత వీటిని రిపేర్లపేరుతో బయటికి తీసుకుపోయి పాతవి బాగుచేసి పెడుతున్నట్లు సమాచారం.

మొక్కల పెంపకం పేరుతో..
బాలసదన్‌ ఆవరణలో మొక్కలునాటి వారి సంరక్షించేందుకు దాతల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సిబ్బంది తెలుపుతున్నారు. వర్షాకాలంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రభుత్వం పిలుపు ఇవ్వడంతోపాటు అందుకు అవసరమైన మొక్కలు, కంచెవంటివి పంపిణీ చేసింది. ఈ మొక్కల పెంపకం సాకుగా చూపి బాలల మధ్య  వేడుకలు జరుపుకోవడానికి బాలసదన్‌కు వచ్చిన దాతల నుంచి విరాళాలు వేలల్లో వసూలు చేసినట్లు ప్రజలు తెలుపుతున్నారు.

ప్రభుత్వం దృష్టి సారించాలి..
బాలసదన్‌కు విరాళంగా ఇచ్చిన నగదు, వస్తువుల రికార్డులు ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అసవరం ఉంది. దాతలు ఇచ్చినపుడే రికార్డుల్లో రాసి వారికి రశీదు వంటివి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

1/1

బాలసదన్‌ భవనం బాలసదన్‌లో మూలన పడిన దాతలు విరాళంగా ఇచ్చిన వస్తువులు

Advertisement
Advertisement