భాగ్యనగరంలో ‘బాలాకోట్‌’!

Opposition Parties are Targeting the BJP - Sakshi

పాక్‌పై దాడుల అంశమే ప్రధాన ప్రచారాస్త్రం

మోదీ నోట అవే మాటలు.. సీఎం సభల్లోనూవాటి ప్రస్తావనే

ఇక కాంగ్రెస్‌ నేతల ప్రచారం అంతా వాటి చుట్టూనే

రూరల్‌ ప్రచారానికి భిన్నంగా హైదరాబాద్‌లో పార్టీల పంథా  

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ దృష్టి దేశంపై పడేలా చేశామంటూ కేంద్ర ప్రభుత్వ ఘనతను చెప్పుకునే బీజేపీ నేతలు.. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అంటూ బలంగా వినిపించే టీఆర్‌ఎస్‌ నేతలు... సంక్షేమంలో నాటి యూపీఏ ప్రభుత్వ పథకాలే భేష్‌ అంటూ ప్రసంగించే కాంగ్రెస్‌ నేతలు... భాగ్యనగర రాజకీయ గోదాలోకి వచ్చేసరికి ప్రచారం తీరు మారుస్తున్నారు. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై భారత సైన్యం జరిపిన దాడుల అంశానికి వద్దు వద్దంటూనే ప్రచారంలో పెద్ద పీట వేస్తున్నారు. మోదీ మరోసారి ప్రధాని కాకుంటే పాకిస్తాన్‌ రెచ్చిపోతుందని, అది దేశానికే నష్టమని బీజేపీ నేతలు.. ఆ దాడుల్లో గొప్పేముంది, గతంలో యూపీఏ హయాంలోనూ ఇలాంటి సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయంటూ టీఆర్‌ఎస్‌ నేతలు.. అసలు బాలాకోట్‌ దాడుల్లో పేరుతో పాక్‌కు జరిగిన నష్టమేమీ లేదని, లేని ఘనతను బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారని కాంగ్రెస్‌ నాయకులు... ఇలా అందరికీ భాగ్యనగరంలో పాక్‌పై దాడుల అంశమే ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది.  

హైదరాబాద్‌లో అంతే.. 
‘కారు.. సారు.. పదహారు..’అంటూ రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర ప్రచారం చేస్తున్నా టీఆర్‌ఎస్‌ నేతలు.. హైదరాబాద్‌కు వచ్చేసరికి మాత్రం ప్రధాని మోదీ దూకుడుకు అడ్డుకట్ట వేసేలా ప్రచార సరళి మారుస్తున్నారు. ఇటు కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి తెలంగాణ జనాన్ని వంచిస్తోందంటూ ఇతర ప్రాంతాల్లో గట్టిగా విమర్శిస్తున్న బీజేపీ నేతలు.. హైదరాబాద్‌లో మాత్రం పాక్‌పై దాడుల అంశానికే ప్రాధాన్యమిస్తున్నారు. 16 స్థానాలు గెలిచినా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ చక్రం కాదు కదా కనీసం బొంగరం కూడా తిప్పలేదంటూ ఎద్దేవా చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు.. నగరంలో మోదీని టార్గెట్‌ చేస్తూ ప్రచారం చేస్తున్నారు.  

ప్రతిపక్షాలపై ప్రధాని ఫైర్‌ 
మూడ్రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో వాడివేడీగా ప్రసంగించారు. ఆయన మాటల్లో ఎక్కువగా మజ్లిస్, పాక్‌కు అనుకూలంగా ప్రతిపక్షాలు మాట్లాడటం, కశ్మీర్‌.. అంశాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ఆయన తన మాటతీరు మార్చుకున్నారు. సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడటం కంటే పరోక్షంగా పాక్‌పై భారత సైన్యం దాడులను ప్రస్తావించేలా ఉపన్యాసం సాగింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధానమంత్రి కావాలన్న ఫరూక్‌ అబ్దుల్లా మాటలను కూడా ఉటంకించారు. పాక్‌ను సమర్థించేలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయంటూ.. వారికి దేశంపై ఉన్న అభిమానాన్ని శంకించేలా మాట్లాడి ఆకట్టుకున్నారు. 

మోదీ వస్తేనే దేశం సేఫ్‌..: బీజేపీ 
ఇక జనం దృష్టిని ఆకర్షించేందుకు బీజేపీ మోదీ గ్రాఫ్‌ను ముందుంచుతోంది. ఎట్టి పరిస్థితిలో ఆయన మరోసారి ప్రధాని కావాల్సిందేనని, లేకుంటే దేశ భవిష్యత్‌ గందరగోళమవుతుందంటూ ప్రచారం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తావించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లు, భగీరథ నీళ్లు, నగరంలో రోడ్లు.. లాంటి అంశాల జోలికే వెళ్లటం లేదు. దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీ మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించాలని, టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మోదీ వ్యతిరేకులకు ఓటేసినట్టేనని, ఇటు కాంగ్రెస్‌కు ఓటేసినా, టీఆర్‌ఎస్‌కు వెళ్తుందంటూ బీజేపీ ప్రచారంలో చెప్పుకుంటోంది. బీజేపీ ఎంత బలంగా పాక్‌పై దాడుల అంశాన్ని తెరపైకి తెస్తుంటే.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు వాటిని ఖండించే క్రమంలో అవే అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రచారం సాగిస్తున్నాయి.

సిటీలో సీఎం టార్గెట్‌ బీజేపీనే.. 
ఇక సీఎం కేసీఆర్‌ కూడా వీలైనప్పుడల్లా సర్జికల్‌ స్ట్రైక్స్, బాలాకోట్‌ దాడులపై కేంద్రం చెప్పేవి అబద్ధాలంటూ.. తన పదునైన వ్యాఖ్యలతో జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బీజేపీనే బలంగా ఉందన్న భావనతో ఆయన వీలైనంత వరకు ఆ పార్టీపైనే ఆరోపణలు, విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సీఎంతోపాటు ఆ పార్టీ నేతలు కూడా సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌పై కంటే బీజేపీనే టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నారు. ఇటు సికింద్రాబాద్, మల్కాజిగిరిలలో కూడా బీజేపీనే బాగా టార్గెట్‌ చేస్తున్నారు. ఇక మల్కాజిగిరి బరిలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి కూడా ఇటు టీఆర్‌ఎస్‌ను అటు బీజేపీని ఒకేస్థాయిలో విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన తరఫున జరుగుతున్న ప్రచారంలో కూడా పాక్‌పై దాడుల అంశాలే ప్రస్తావనకు వస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top