‘కంటి వెలుగు’కు ఆపరేషన్ల ఫోబియో!

Operation Phobia For Kanti Velugu Scheme In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’కార్యక్రమం ముగిసినా, లక్షలాది మందికి చేయాల్సిన ఆపరేషన్ల ప్రక్రియ మాత్రం ఇప్పటికీ తిరిగి మొదలు కాలేదు. ఈ ఆపరేషన్లు చేయించడానికి అధికారులు సుముఖత చూపడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా సీఎం కేసీఆర్‌ ఆశయాలకు వైద్య ఆరోగ్యశాఖ తూట్లు పొడుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకట్రెండు చోట్ల చేసిన ఈ ఆపరేషన్లు వికటించడంతో మొత్తం ఆపరేషన్ల ప్రక్రియను నిలిపివేశారు.  ‘మనకెందుకు ఈ రిస్క్‌. ఒకవేళ ఆపరేషన్లు తిరిగి ప్రారంభించాక ఎక్కడైనా వికటించినా, సమస్య వచ్చినా బదనాం అవుతా’మన్న ధోరణిలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులున్నట్లు తెలుస్తోంది. వారి తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే పరిస్థితి నెలకొందని అంటున్నారు.

‘లక్షలాది మందికి ఆపరేషన్లు చేస్తే ఒకట్రెండు చోట్ల చిన్నచిన్న సమస్యలు రావడం సహజం. పేరున్న ప్రైవేటు ఆసుపత్రుల్లో చేసినా ఇలాంటివి జరుగుతుంటాయి. అలాగని ఆపరేషన్లు చేయడం ఆపేస్తామా?’అని ఒక కంటి వైద్య నిపుణుడు అభిప్రాయపడ్డారు. కచ్చితమైన మార్గదర్శకాలు జారీచేసి ఆ ప్రకారం జాగ్రత్తలు చెప్పి, ప్రముఖ కంటి ఆసుపత్రుల్లో చేసేలా నిర్ణయాలు తీసుకుంటే బాగుండేదని అంటున్నారు. ఎల్వీ ప్రసాద్‌ వంటి కంటి ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుంటే బాగుండేదంటున్నారు. కానీ ఉన్నతాధికారులు రిస్క్‌ తీసుకోకుండా కేవలం ఉద్యోగం చేస్తున్నామా? ఇంటికి పోతున్నామా? అన్న ధోరణిలోనే ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. పైగా ఈ కార్యక్రమాన్ని కేంద్రం ఆధ్వర్యం లోని అంధత్వ నివారణ కార్యక్రమం ద్వారా చేపట్టే అవకాశం కూడా ఉంది.
 
9.30 లక్షల మందికి కంటి లోపం...  

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం గత నెలలో ముగిసింది. కీలకమైన ఎన్నికల సమయంలో ఈ కార్యక్రమంతో గ్రామాల్లో కేసీ ఆర్‌కు ఎంతో కలిసి వచ్చింది. ఆనాడు కోటి కళ్లు ఆయన్నే దీవించాయి. ఏడు నెలలపాటు కంటి వెలుగు కింద 1.54 కోట్ల మందికి పరీక్ష లు నిర్వహించారు. 9,882 గ్రామాల్లో (99. 50%) కంటి పరీక్షలు పూర్తిచేశారు. వారిలో అత్యధికంగా 90.25 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలే ఉండటం గమనార్హం. అందులో అత్యధికంగా బీసీలు 89.90 లక్షల (58.12%) మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఎస్సీలు 16.60 శాతం, ఎస్టీలు 11.02 శాతం, మైనారిటీలు 4.51 శాతం ఉపయోగిం చుకున్నారు. అంటే బడుగు బలహీన వర్గాలకు ఈ పథకం కింద కంటి పరీక్షలు జరిగాయంటే సర్కారు అనుకున్న లక్ష్యం నెరవేరింది.

అంతే కాదు 22.92 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసులు అక్కడికక్కడే అందజేశారు. మరో 10.12 లక్షల మందికి చత్వారీ అద్దాలు ఇచ్చారు. మరో 8 లక్షల మందికి చత్వారీ అద్దాలు సరఫరా చేయడంలో లోపంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇక కంటి సమస్యలున్నాయని, ఆపరేషన్లు సహా ఇతరత్రా తదుపరి వైద్యం కోసం 9.30 లక్షల మందిని పై ఆసుపత్రులకు రిఫర్‌ చేశారు. వారిలో దాదాపు ఆరు లక్షల మందికి వివిధ రకాల ఆపరేషన్లు అవసరమని, మిగిలిన వారికి తదుపరి వైద్యం అవసరమని అంచనా వేశారు. లక్ష మందికి మాత్రం తీవ్రమైన కంటి లోపం ఉందని, వారికి ఆపరేషన్లు తక్షణమే చేయాల్సి ఉందని తేల్చారు. కానీ వైద్య ఆరోగ్యశాఖ మాత్రం కాలయాపన చేస్తూ సర్కారుకు చెడ్డ పేరు తెస్తోంది. అధికారుల తీరుపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
 
వికటిస్తాయన్న భయమే కారణమా...

కంటి ఆపరేషన్లు చేయకపోవడానికి కేవలం అవి వికటిస్తాయన్న భయమే కారణమని ఓ కీలక అధికారి అభిప్రాయపడ్డారు. దీంతో ముఖ్యమంత్రి వద్దకు సమగ్రమైన మార్గదర్శకాలతో వెళ్లి కంటి ఆపరేషన్లు మొదలుపెట్టడానికి ఎవరూ సాహసించడంలేదు. మరో వైపు బాధితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.  అటు అధికారులు ఇటు ప్రభుత్వం చొరవ చూపి బాధితులకు ఊరటనివ్వాల్సిన అవసరం ఉంది. ∙ కంటి శస్త్రచికిత్సలపై చేతులెత్తేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ
∙ దీంతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ప్రక్రియ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top