చాటింగ్‌ ట్రీట్‌మెంట్‌!

Online Treatment Trend in Hyderabad - Sakshi

నగరంలో నయా ట్రెండ్‌

‘హలో డాక్టర్‌.. నేను గత రెండు రోజులుగా జలుబు, తలనొప్పితో బాధపడుతున్నాను. సరైన మందులు సూచించగలరు.. అంటూ ఓ పేషెంట్‌ వాట్సాప్‌ సందేశం.ఓకే... మీరు రెండురోజుల పాటు ఫలానా యాంటీబయాటిక్స్‌ వాడండి. అప్పటికీ తగ్గకుంటే క్లినిక్‌కు రండి.. అంటూ డాక్టర్‌ రిప్లై.

సాక్షి, హైదరాబాద్‌  :ఇదే చాటింగ్‌ ట్రీట్‌మెంట్‌ అంటే.. గ్రేటర్‌లో ఇటీవల ఇది క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా ఐటీ కారిడార్‌లో పలు ఐటీ, బీపీఓ, కెపీఓ కంపెనీల్లో ఈ ట్రెండ్‌ క్రమంగా విస్తరిస్తోంది. తలనొప్పి, కడుపునొప్పి, మైగ్రేన్, వంటి నొప్పులు, వైరల్‌ ఫీవర్, జలుబు.. తదితర స్వల్పకాలిక అనారోగ్యాలకు మాత్రమే ఇలాంటి ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారు. ఇలాచేస్తే ఉద్యోగుల సమయం చాలా ఆదా అవుతోందని వారిలో పని సామర్థ్యం పెరుగుతుందని ఆయా కంపెనీలు భావిస్తుండటం విశేషం. వృత్తి, ఉద్యోగాల్లో క్షణం తీరిక లేకుండా గడిపే తమకు ఇలాంటి సేవలు అవసరమేనని ఉద్యోగు లు అంటున్నారు. ఇలాంటి వైద్యం నాణ్యతపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యాంటీబయాటిక్స్, ఇతర మందుల డోసు ఎక్కువైతే కొన్నిసార్లు ఆరోగ్యానికి బదులు మరింత అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. 

చాటింగ్‌ ట్రీట్‌మెంట్‌ ఇలా...
తమ ఉద్యోగులకు వైద్య సేవలందించేందుకు పలు కంపెనీలు పలువురు ఫిజీషియన్లు, ఇతర స్పెషలిస్ట్‌ వైద్యులతో ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా వైద్యుల ఫోన్‌ నంబర్లను తమ ఉద్యోగులకు అందజేసి వారి శారీరక, అనారోగ్య సమస్యలను నేరుగా ఆయా వైద్యులతో చాటింగ్‌ ద్వారా తెలియజేసే అవకాశం కల్పిస్తున్నారు. ట్రీట్‌మెంట్‌ ఇచ్చే వైద్యులకు నెలవారీగా ఆయా కంపెనీలు పారితోషికం అందిస్తున్నాయి. పనివేళల్లో అనారోగ్యానికి గురయ్యే ఉద్యోగి ఆస్పత్రికి వెళ్లి గంటల తరబడి నిరీక్షించేంత సమయం చిక్కనందున ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. 

పని సామర్థ్యం మెరుగు...
దీర్ఘకాలిక అనారోగ్యాలు, జీవనశైలి వ్యాధులున్నవారు మాత్రం నేరుగా స్పెషాలిటీ వైద్య సేవల కోసం ఆయా ఆస్పత్రులకు వెళుతున్నట్లు చెబుతున్నారు. పని ఒత్తిడి ఎక్కువైతే మానసిక వైద్యుల ను చాటింగ్‌ ద్వారా సంప్రదించి అవసరమైన సలహాలు, సూచనలు తమ ఉద్యోగులు పొందుతున్నట్లు వెల్స్‌ఫార్గో ఐటీ సంస్థ హెచ్‌ఆర్‌ విభాగం ప్రతినిధి సత్యలింగం ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం బాగా ఉంటేనే వారి పనిసామ ర్థ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. మరికొన్ని కంపెనీలు విదేశాల్లో ఉన్న వైద్య నిపుణుల సలహాలు, సూచనలను తమ ఉద్యోగులు పొందేందుకు టెలీ మెడిసిన్‌ సేవలను సైతం వినియోగిస్తుండటం గ్రేటర్‌లో నయా ట్రెండ్‌గా మారింది. చాటింగ్‌ ట్రీట్‌మెంట్‌ ఉద్యోగులకు వెసులుబాటును, వైద్యులకు కాసులను, కంపెనీలను లాభాల బాట పట్టిస్తుండటం విశేషం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top