ఉల్లి ధర ఢమాల్

ఉల్లి ధర  ఢమాల్


దేవరకద్ర:  ఒకప్పుడు వినియోగదారులను కన్నీరు పెట్టించిన ఉల్లి.. నేడు రైతు కంట పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనడానికి వ్యాపారులే ముందుకు రావడం లేదు. మార్కెట్లో పోసి వ్యాపారుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో వచ్చినికాడికే దిక్కు అనుకుంటూ రైతులకు తక్కువ ధరకే పంటను తెగనమ్ముకుంటున్నారు.    



ఉల్లిపాయల ధరలు మరోసారి పడిపోయాయి. కొన్ని వారాలుగా నిలకడగా ఉన్న ధరలు క్వింటాకు రూ. 300 నుంచి రూ. 400వరకు తగ్గాయి. గత వారం దేవరకద్ర మార్కెట్‌కు సెలవు కారణంగా బహిరంగ వేలం జరగక పోవడంతో బుధవారం రైతులు పెద్ద ఎత్తున ఉల్లిపాయలు అమ్మకానికి తెచ్చారు.

 

 పాత మార్కెట్ అవరణతో పాటు కొత్త షాపుల అవరణంతా ఉల్లి కుప్పలతో నిండి పోయింది. నాలుగు వేల బస్తాల ఉల్లి పాయలు మార్కెట్‌కు వచ్చి ఉండవచ్చని వ్యాపారుల అంచనా. ఒక దశలో ట్రాక్టర్లపై వచ్చిన ఉల్లిపాయలను వ్యాపారులు కింద పోయకుండా అలాగే ఉంచారు. రెండు వారాల క్రితం వరకు క్వింటాల్ ఉల్లి ధర గరిష్టంగా రూ.1650వరకు ఉండగా ఈ వారం రూ. 1350కు పడి పోయింది. దీనికితోడు ఉల్లిపాయలు కొనుగోలు చేసేవారు కరువయ్యారు. చాలా కుప్పలను వేలం వేయకుండా రూ.400 నుంచి రూ. 800కు క్వింటాల్ కొనుగోలు చేశారు.

 

 వ్యాపారులు వచ్చినా..

 ఇతర ప్రాంతాల నుంచి ఉల్లి పాయలను కొనుగోలు చేయడానికి వ్యాపారులు వచ్చిన ఉల్లి ధరలు పెరగలేదు. హైదరాబాద్ మార్కెట్‌లో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల వ్యాపారులు వేలంలో ధరలు పెంచడానికి వెనకడుగు వేశారు. అయితే రెండు వారాల ఉల్లిపాయలు ఒకే వారం రావడం వల్ల ఉల్లి ధరలు తగ్గాయని రైతులు అంటున్నారు. తక్కువ మొత్తంలో ఉల్లిపాయలు వచ్చినప్పుడు ఉల్లి ధరలు పెరగడం, ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడు ధరలు తగ్గడం పరిపాటిగా మారిందని రైతులు అంటున్నారు.

 

  ప్రజలు తమ ఇంటి అవసరాల కోసం ఉల్లి పాయలను కొనుగోలు చేశారు. చాలామంది ఏడాది పాటు ఇంట్లో నిల్వ చేసుకోడానికి, పెళ్లి పేరంటాల కోసం బస్తాలలో కొనుగోలు చేశారు. ఇక సంతల్లో విక్రయించే వారు తక్కువ వేలం వచ్చిన ఉల్లి కుప్పల నుంచి కొనుగోలు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top