మహబూబ్‌నగర్‌లో ఉల్లి..లొల్లి!

Onions Cost Increasing In Mahabubnagar  - Sakshi

రోజురోజుకు పెరుగుతున్న రేట్లతో జనం బెంబేలు 

స్థానికంగా సాగు తగ్గడమే కారణం 

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అటువంటి ఉల్లి నేడు ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఉన్న ధర నేడు ఉండటంలేదు. ఈ రోజు ఉన్న రేటు రేపు రెట్టింపవుతోంది. నెల రోజుల కిందట కేవలం రూ.20 ఉన్న ఉల్లి ధర బుధవారం  రూ.60కు ఎగబాకింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వ్యాపారులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  

దిగుమతి లేకనే.. 
ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని తక్కువగా దిగుమతి చేసుకోవడంతో కొరత వచ్చిందని మార్కెట్‌ వర్గాలు చెబుతుండగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ ప రిస్థితి వచ్చిందని రైతులు అంటున్నారు. ఉల్లిపాయల ఉత్పత్తికి పేరుగాంచిన మహారాష్ట్ర రాష్ట్రంలో ముందుగా కరువు ఉండటంతో సా గు ఆలస్యమైంది. కర్నాటక నుంచి రావాల్సిన ఉల్లి కూడా రాకపోవడంతో రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లికి డిమాండ్‌ పెరిగింది.

ప్రస్తుత దిగుబడి సమయంలో వర్షాలు అధికమవడం కూడా కొరతకు కారణంగా చెప్పవచ్చు. ఇదే అదునుగా కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరల పెరుగుదలకు కారణమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వా రానికే సగానికి సగం ధర పెరిగిపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. 15 రోజుల వ్యవధిలో కిలో కు రూ. 15 నుంచి రూ. 20 పెరగడం తో సామాన్యులు తట్టుకోలేకపోతున్నా రు. సాధారణంగా కిలో రూ.15 నుంచి రూ. 20 వరకు ఉండేది. ప్రస్తుతం రూ. 50 నుంచి రూ. 60 పలుకుతోంది.  

ప్రభుత్వ కేంద్రాలు ఎక్కడా? 
ప్రతీఏటా ఉల్లి ధర అమాంతం పెరుగుతూనే ఉంటుంది. ఆ సమయంలో మార్కెటింగ్, జిల్లా పౌరసరఫరాల శాఖల అధికారులు రైతుబజార్‌ లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తుంటారు. గ తంలో చౌకధర దుకాణాల ద్వారా కూడా తక్కు వ ధరకు ఒక్కొక్కరికి రెండు కిలోల చొప్పున ఉ ల్లిని అందించారు. అయితే ఈసారి విక్రయ కేం ద్రాలు ఏర్పాటు చేయలేదు. పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు స్పందించి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి సామాన్య, పేద ప్రజలకు తక్కువ ధర కు ఉల్లిగడ్డలు అందించాలని వినియోగదారులు కోరుతున్నారు.  

సామాన్యులు విలవిల 
ఓ వైపు నిత్యవసర సరుకులు, మరో వైపు కూరగాయలు ఇలా రోజురోజుకు పెరగుతున్న ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రలో ఖరీఫ్‌ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో వరదలు వచ్చిన కారణంగా  ఉల్లిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దీంతో ప్రస్తుతం ఉల్లిధర కొండెక్కి కూర్చుంది.  ఇదే సాకుగా వ్యాపారులు అక్రమ నిల్వలు చేస్తున్నారు.  

ఆనందంలో రైతులు 
దేవరకద్ర మార్కెట్లో కొత్త ఉల్లి దిగుమతులు ప్రారంభమైనా ధర మాత్రం తగ్గడం లేదు. అధికారుల సూచనలు పాటించి పండించిన రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఏడాది మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో వచ్చిన భారీ వర్షాల కారణంగా ఉల్లి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా రాష్ట్రాలలో ఉల్లి కొరత తీవ్రంగా ఏర్పడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో రాష్ట్రానికి తగినంత వచ్చే ఉల్లి దిగుమతులు పూర్తిగా తగ్గి పోయాయి. జిల్లాలో కూడా ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల డిమాండ్‌ బాగా పెరిగింది. గత రెండేళ్ల నుంచి రూ. 1000 దాటని ఉల్లి ధరలు రెండు నెలల నుంచి మూడింతలయ్యాయి. 

గరిష్టంగా రూ. 3,520
దేవరకద్ర మార్కెట్‌లో బుధవారం ఉల్లి వేలం జోరుగా సాగింది. మార్కెట్‌లోని రెండు షెడ్లు ఉల్లి కుప్పలతో నిండి పోయాయి. గూరకొండ, గోప్లాపూర్‌ తదితర గ్రామాల నుంచి రైతులు కొత్త ఉల్లిని అమ్మకానికి తీసుకువచ్చారు. ట్రాక్టర్లలో తెచ్చిన ఉల్లిని కిందకు పోయకుండానే వేలం వేశారు. దాదాపు 5 వందల బస్తాల ఉల్లి మార్కెట్‌కు అమ్మకానికి వచ్చినా ధరలు మాత్రం పెరిగాయి తప్ప దిగిరాలేదు.

దేవరకద్ర మార్కెట్‌ వ్యాపారులతో పాటు బయట ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పోటీ పడ్డారు. ఉల్లి  క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 3,520, కనిష్టంగా రూ. 2,910, మధ్యస్తంగా రూ. 3,215 వరకు ధరలు వచ్చాయి. ఇక పాత ఉల్లికి ఏకంగా క్వింటాల్‌కు రూ. 3800 వరకు ధర వచ్చింది. గతంలో తీవ్రంగా నష్ట పోయిన ఉల్లి రైతులు ఉల్లిని ఇప్పుడు వచ్చిన ధరలు చూసి ఆనందంలో మునిగి పోయారు. 

45 కేజీల బస్తా ధర రూ. 1800... 
మార్కెట్‌లో కొనుగోలు చేసిన ఉల్లిని వ్యాపారులు 45 కేజీల బస్తాను గరిష్టంగా రూ. 1800 లకు విక్రయించగా, కనిష్టంగా రూ. 1600 నుంచి వరకు ప్యాకెట్‌గా విక్రయించారు.  చిరు వ్యాపారులు ఉల్లిని బస్తాలుగా కొనుగోలు చేసి బుధవారం జరిగిన దేవరకద్ర సంతలో చిల్లరగా కిలో రూ. 40 నుంచి రూ. 35 వరకు విక్రయించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top