భద్రాచలంలోని రాములవారిని దర్శించుకోవడానికి కుటుంబ సభ్యులతో వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
వరంగల్: భద్రాచలంలోని రాములవారిని దర్శించుకోవడానికి కుటుంబ సభ్యులతో వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
వరంగల్ జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి గ్రామ శివారులో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హన్మకొండకు చెందిన బంగారు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలసి కారులో భద్రాచలం బయలుదేరారు. ఈ క్రమంలో మంగపేటలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి నుంచి చుంచుపల్లి గ్రామ శివారులోకి చేరుకోగానే.... కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పుష్పమ్మ(68) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.