భర్త కోసం టీ తీసుకెళ్తున్న మహిళ రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె చేతిలో ఉన్న చిన్నారి మృతిచెందగా.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ : భర్త కోసం టీ తీసుకెళ్తున్న మహిళ రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె చేతిలో ఉన్న చిన్నారి మృతిచెందగా.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గచ్చిబౌలి క్రాస్‌రోడ్డు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని భూంది జిల్లాకు చెందిన మమతా బాయి(23) కుటుంబం బతుకు తెరువు కోసం రెండేళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. ఈ క్రమంలో శిల్పారామం సమీపంలో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.
కాగా శుక్రవారం భర్త కోసం టీ తీసుకెళ్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా.. వేగంగా వెళ్తున్న కారు ఆమెను ఢీకొట్టింది. అనంతరం ఆమె పై నుంచి దూసుకుపోయింది. ఆ సమయంలో ఆమె చెతిలో ఎనిమిది నెలల పాప ఉంది. ఈ ప్రమాదంలో పాప మృతిచెందగా.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు కారు డ్రైవర్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. తీవ్రంగా గాయాలైన మమత పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.