
కరెంట్ కోతలపై రైతుల కన్నెర్ర
కరెంటు కోతలపై ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో రైతులు కన్నెర్ర చేశారు.
ఖమ్మం/వరంగల్: కరెంటు కోతలపై ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో రైతులు కన్నెర్ర చేశారు. వ్యవసాయ, పారిశ్రామిక, గృహ అవసరాలకు భారీగా విద్యుత్ కోతలు విధించడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళనలు నిర్వహించారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కోతల విషయంలో సీఎం కేసీఆర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎస్‌ఈ తిరుమలరావుకు వినతి పత్రం అందచేశారు.
పరిశ్రమలకు పవర్ హాలీడే విధింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఖమ్మం జిల్లా గ్రానైట్ అసోసియేషన్ నాయకులు ఎస్‌ఈకి వినతి పత్రం అందచేశారు. అలాగే, వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. చేర్యాల మండలంలోని ముస్త్యాల సబ్‌స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని ఏడీఈ కార్యాలయాన్ని ముట్టడించారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, దాని అనుబంధ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
మార్కెట్‌లో రైతుల నిరసన
వరంగల్ : జిల్లా కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతులు తమ సమస్యలపై శుక్రవారం నిరసన చేపట్టారు. సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఆరూరి రమేష్‌ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. వ్యవసాయానికి ఆరు గంటలు విద్యుత్ సరఫరా చేయాలని, కరెంట్ కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.