‘గురుకుల’ విభజనపై కొత్త చిక్కులు

Officials Confused To Gurukulam Posts Divides In Telangana - Sakshi

రాష్ట్రపతి ఉత్తర్వుల వర్తింపుపై ప్రభుత్వాన్ని స్పష్టత కోరిన బోర్డు

వర్తింపు విషయంపై గురుకుల బోర్డే తేల్చుకోవాలన్న ప్రభుత్వం

వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలంటూ నోటీసు

అయోమయంలో అధికారులు.. బోర్డు బైలాస్‌ పరిశీలన  

సాక్షి, హైదరాబాద్‌ : గురుకుల విద్యాసంస్థల సొసైటీల పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో పోస్టుల విభజనకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానం అమలుకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆ మేరకు పోస్టులను జోన్లు, మల్టీజోన్లు, జిల్లా కేడర్‌వారీగా విభజించాలి. ఆ తర్వాతే కొత్తగా నియామకాలు చేపట్టేందుకు నోటిఫికేషన్లు జారీ చేసే వీలుంటుంది. ఈ క్రమంలో పోస్టుల విభజనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతూ గురుకుల నియామకాల బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల ఆధారంగా వాటిని విభజిస్తే సరిపోతుందని బోర్డు భావించినప్పటికీ ప్రభుత్వ స్పందన భిన్నంగా రావడంతో గురుకుల నియామకాల బోర్డు తలపట్టుకుంది. 

మీరే స్పష్టత ఇవ్వాలి... 
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త జోనల్‌ విధానం నేపథ్యంలో గురుకుల విద్యాసంస్థల సొసైటీలు కొత్త నిబంధనల పరిధిలోకి వస్తాయా లేదా అనే అంశాన్ని తేల్చుకునేందుకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు గత నెలలో ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు గురుకుల సొసైటీకి వర్తిస్తాయా లేక ప్రత్యేక నిబంధనలకు లోబడి పనిచేస్తాయా చెప్పాలని కోరింది. అయితే అనూహ్యంగా ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయాన్ని బోర్డుకే వదిలేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా బోర్డుకు తిరుగు లేఖ రాశారు. వీలైనంత త్వరగా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీంతో బోర్డు డైరెక్టర్లు తెల్లబోయారు. ప్రభుత్వమే తేల్చాల్సిన అంశాన్ని బోర్డుకు వదిలేయడంపై అయోమయంలో పడ్డారు. ఈ క్రమంలో బోర్డు ఏర్పాటు సమయంలో బైలాస్, నియామకాల్లో పాటించిన విధానాన్ని పరిశీలించి నివేదిక తయారు చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖ సొసైటీ కార్యదర్శులు నిర్ణయించారు. ఇటీవల ప్రత్యేకంగా సమావేశమై ఒక దఫా చర్చలు జరిపిన కార్యదర్శులు మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top