నల్లగొండ మున్సిపాలిటీలో నర్సరీలు..!

Nurseries In Nalgonda Muncipality - Sakshi

 లక్ష మొక్కలు పెంచడానికి ప్రతిపాదనలు

 సమభావన సంఘాల వారిచే పెంచనున్న మొక్కలు

నల్లగొండ టూటౌన్‌ :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం కింద ఇకనుంచి మున్సిపాలిటీలో కూడా నర్సరీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీలగిరి మున్సిపాలిటీలో ఈ ఏడాది నర్సరీల ద్వారా ఒక లక్ష మొక్కలు పెంచేందుకు మున్సిపల్‌ అధికారులు ప్రతిపానదలు రూపొందించారు. మెప్మా పర్యవేక్షణలో సమభావన సంఘాల మహిళల ద్వార నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంపకం చేపట్టాలని నిర్ణయించారు.

నీలగిరి పట్టణంలో ఉన్న సమభావన సంఘాల్లోని ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వస్తే వారిచే నర్సరీల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. సమభావన సంఘాల మహిళలు ఏర్పాటు చేసే నర్సరీలలో మొక్కలను మున్సిపాలిటీ కొనుగోలు చేయనుంది. గత ఏడాది వరకు ఇతర నర్సరీల నుంచి మొక్కలు తెచ్చి హరితహారం కింద మొక్కలు నాటే వారు. 

ఒక్కో మొక్కకు రూ.10 చెల్లింపు
నర్సరీలు ఏర్పాటు చేయాలంటే తగినంత స్థలం, నీటి వసతి, వాటి రక్షణ అవసరం ఉంటుంది. ఈ సౌకర్యాలు ఉన్న వారిని గుర్తించి వారికి మాత్రమే నర్సరీలు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తారు. నారు కొనుగోలు చేయడంతో పాటు ఎర్రమట్టి, కవర్లు, ఎరువు తదితర వాటిని సంబంధిత మహిళలే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నారు గింజలను కూడా మెప్మా సిబ్బంది కొనుగోలు చేయిస్తారు.

దాదాపు నాలుగున్నర నెలల పాటు నర్సరీలలో మొక్కలు పెంచాల్సి ఉంటుంది. 2నుంచి 3 ఫీట్లు పెంచిన మొక్కలను మున్సిపాలిటీ కొనుగోలు చేసి పట్టణంలో అవసరమైన ప్రాంతాల్లో నాటుతారు. నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచిన సంబంధిత మహిళలకు ఒక్కో మొక్కకు రూ. 10 ల చొప్పున మున్సిపాలిటీ చెల్లిస్తుంది. మహిళలు ఎన్ని మొక్కలు పెంచినా వాటిలో బతికిన వాటికి మాత్రమే మున్సిపల్‌ అధికారులు డబ్బులు ఇస్తారు. 

బ్యాంకు రుణ సౌకర్యం...
నర్సరీలను ఏర్పాటు చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే సంబంధిత మహిళలకు బ్యాంకు రుణం ఇప్పించాలని మున్సిపల్‌ అధికారులు భావిస్తున్నారు. మహిళా సభ్యులు వ్యక్తి గతంగానైనా, గ్రూపుగానైనా నర్సరీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి బ్యాంకుల ద్వారా మొక్కలను బట్టి రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. మొక్కలు విక్రయించిన తర్వాత బ్యాంకులో చెల్లించే విధంగా సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడాలని మున్సిపల్‌ అధికారులు భావిస్తున్నారు. 

నర్సరీల ద్వారా లక్ష మొక్కలు
నీలగిరి పట్టణంలో మొక్కల సరఫరాకు ఇబ్బం ది లేకుండా ఇక్కడే నర్సరీలు ఏర్పాటు చేయాలని సీడీఎంఏ అధికారులు ఆదేశించారు. మహిళా సంఘాల వారి ద్వార నర్సరీలు ఏర్పా టు చేసి లక్ష మొక్కలు పెంచడానికి నిర్ణయిం చాం. వారు పెంచిన మొక్కలను మున్సిపాలిటీ కొనుగోలు చేస్తుంది. 
– దేవ్‌సింగ్, మున్సిపల్‌ కమిషనర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top