3 నుంచి ఎన్‌టీవీ ప్రసారాలు నిలిపివేత, పిటిషన్ | NTV files petition in High Court ban of cinecolors programme | Sakshi
Sakshi News home page

3 నుంచి ఎన్‌టీవీ ప్రసారాలు నిలిపివేత, పిటిషన్

Jan 28 2015 8:40 AM | Updated on Aug 31 2018 8:53 PM

3 నుంచి ఎన్‌టీవీ ప్రసారాలు నిలిపివేత, పిటిషన్ - Sakshi

3 నుంచి ఎన్‌టీవీ ప్రసారాలు నిలిపివేత, పిటిషన్

తమ చానల్ ప్రసారాలను ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు నిషేధిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌టీవీ) యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.

* వచ్చే నెలలో వారం రోజులు
* ఎన్‌టీవీ ప్రసారాలపై కేంద్రం నిషేధం

 
సాక్షి, హైదరాబాద్: తమ చానల్ ప్రసారాలను ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు నిషేధిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌టీవీ) యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వం గత నెల 19న జారీ చేసిన ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఆ సంస్థ డెరైక్టర్ టి.రమాదేవి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శిని ప్రతివాదిగా పేర్కొన్నారు. గతంలో ఎన్‌టీవీలో రాత్రి 11.30 గంటలకు సినీకలర్స్ పేరుతో  ప్రసారమయ్యే కార్యక్రమంలోని పాటల్లో అసభ్యత, అశ్లీలత ఉంటోందంటూ కేంద్రానికి ఫిర్యాదు అందింది. దీనిపై సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆ కార్యక్రమ డీవీడీలను పరిశీలించింది.
 
 అందులో అశ్లీలత, అసభ్యత ఉంటోందని, వీక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఈ కార్యక్రమం లేదని తేల్చింది. ఇది కేబుల్ టీవీ నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల ఎన్‌టీవీ ప్రసారాలను ఫిబ్రవరి 3 నుంచి వారం రోజుల పాటు నిషేధిస్తున్నట్లు ఆ శాఖ డెరైక్టర్ నీతి సర్కార్ గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 2012, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ప్రసారమైన ఈ కార్యక్రమంపై కేంద్రానికి రాతపూర్వకంగా వివరణ ఇచ్చామని పిటిషన్‌లో ఎన్‌టీవీ డెరైక్టర్ పేర్కొన్నారు. ఆ కార్యక్రమాన్ని 2012లోనే నిలిపేశామని, దానికి సంబంధించి ఇప్పుడు నిషేధం విధించడం సరికాదన్నారు. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, నిషేధం విధించే అధికారం డెరైక్టర్‌కు లేదని,నిషేధం ఉత్తర్వులను రద్దు చేయాల్సిందిగా ఆమె కోర్టును అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement