నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

Nominations Filing Starts Today  - Sakshi

కలెక్టరేట్‌ వద్ద ఏర్పాట్లు పూర్తి

భారీగా పోలీస్‌ బందోబస్తు

అభ్యర్థి వెంట ఐదుగురికే అనుమతి

ఈనెల 25 వరకు స్వీకరణ 

పెద్దపల్లిఅర్బన్‌: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులంతా రిటర్నింగ్‌ ఆఫీసర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌కు నామినేషన్లు అందిస్తారు. ఈమేరకు కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ సజావుగా సాగేందుకు కలెక్టరేట్‌ కార్యాలయ మైదానంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

భారీగా పోలీస్‌ బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నారు. నామినేషన్‌ పత్రాలను స్వీకరించే ఎన్నికల రిటర్నింగ్‌ కార్యాలయాన్ని సైతం సిద్ధం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను అభ్యర్థుల నుంచి స్వీకరించనున్నారు. మార్చి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. 26న నామినేషన్‌ల పరిశీలన,  28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

 మూడు వాహనాలకు మాత్రమే..

నామినేషన్‌ స్వీకరించే కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద అత్యంత పకడ్బందీ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. నిత్యం రద్దీగా ఉండే రాజీవ్‌ రహదారికి కలెక్టరేట్‌ కార్యాలయం ఆనుకుని ఉంది. అటు వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థుల ర్యాలీలను దూరంలోనే నిలిపివేసేలా బార్డర్‌ గీశారు. నామినేషన్‌ వేసేందుకు వచ్చే అభ్యర్థికి చెందిన మూడు వాహనాలను మాత్రం వంద మీటర్ల దూరం వరకు అనుమతిస్తారు. అలాగే నామినేషన్‌ వేసే సమయంలో అభ్యర్థితో కలిపి ఐదుగురిని మాత్రమే రిటర్నింగ్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతిస్తారు.

 అభ్యర్థి నుంచి డిక్లరేషన్‌..

నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థి నుంచి బ్యాలెట్‌ పేపరుపై పేరు ఏ విధంగా ముద్రించాలో తెలిపే డిక్లరేషన్‌ పత్రాన్ని అధికారులు తీసుకోనున్నారు. జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థిని నియోజకవర్గంలో ఓటుహక్కు కలిగిన ఒకరు ప్రతిపాదించాల్సి ఉండగా, స్వతంత్య్ర అభ్యర్థులు, గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులను పదిమంది ఓటుహక్కు కలిగిన వారు ప్రతిపాదించాల్సి ఉంటుంది. 

డిపాజిట్‌ రూ.12,500 

నామినేషన్‌ దాఖలు చేసే గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం రూ.12,500 డిపాజిట్‌ కింద చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్‌ చేసే సమయంలో ఎస్సీ కుల ధ్రువీకరణపత్రం సమర్పించాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఈనెల 25 వరకు బీ–ఫాంను దాఖలు చేయాలి. అంతేకాకుండా అభ్యర్థులపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను నామినేషన్‌ పత్రాల్లో కచ్చితంగా నమోదు చేయాలి. గడిచిన పదేళ్లలో మున్సిపాలిటీ, పంచాయతీ, విద్యుత్‌ బకాయిలు లేవని సంబంధిత శాఖల నుంచి ధ్రువీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top