అదును దాటాక వాన | no Rain two month | Sakshi
Sakshi News home page

అదును దాటాక వాన

Aug 14 2015 1:49 AM | Updated on Sep 3 2017 7:23 AM

రెండు నెలలుగా వర్షాల జాడలేక పంట చేన్లను పశువులకు వదిలేస్తున్న తరుణంలో అల్పపీడన ద్రోణి రైతులను ఆదుకుంది. ఇప్పటివరకు వేసిన పంటలకు గత


 కరీంనగర్ అగ్రికల్చర్ :రెండు నెలలుగా వర్షాల జాడలేక పంట చేన్లను పశువులకు వదిలేస్తున్న తరుణంలో అల్పపీడన ద్రోణి రైతులను ఆదుకుంది. ఇప్పటివరకు వేసిన పంటలకు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రాణం పోశాయి. పెట్టుబడులు మట్టిపాలవుతాయని ఆందోళన చెందుతున్న అన్నదాతలకు భరోసా కల్పించాయి. వర్షాలతో తిరిగి పంట పొలాలు కళకళలాడుతున్నాయి. కలుపుతీత, ఎరువులు చల్లడం వంటి పనుల్లో రైతులు బిజీగా మారారు. అరుుతే ఖరీఫ్‌లో విత్తనాలు నాటుకునేందుకు అదును దాటిపోగా ఇప్పటికే వేసిన 45 రోజుల నారుమడిని ఈ నెలాఖరు వరకు నాట్లు వేసుకునే అవకాశముంది. మరో 15 రోజులు దాటితే రబీ సీజన్ కాలం రానుండడంతో వ్యవసాయ శాఖ ముందస్తుగా ప్రణాళిక రూపొందించి విత్తనాలను సిద్ధం చేసింది.
 
 3.60 లక్షల హెక్టార్లలోనే సాగు..
 ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి ఆశించిన వర్షాలు లేక బోర్లు, బావులు, చెరువులు, కుంటలు వట్టిపోగా ప్రాజెక్టులలో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి చేరింది. సాగు, తాగు నీటికి కష్టాలు పడుతున్న తరుణంలో కురుస్తున్న వర్షాలు ఆశలు రేకెత్తిస్తున్నామయి. వరిసాగుకు ఈ వర్షాలు పెద్దగా అనుకూలం కాకపోయినా ఇలాంటి వర్షాలు మరిన్ని కురిస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. జిల్లావ్యాప్తంగా 5.40 లక్షల హెక్టార్లలో సాధారణ సాగు విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 3.60 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేశారు. జిల్లాలో కేవలం 68,544 హెక్టార్లలోనే ఇప్పటివరకు వరి నాట్లు వేశారు. వేలాది హెక్టార్లలో వేసిన నారుమడులు వర్షాలు లేక ముదిరిపోయాయి.
 
 ముందస్తుగా రబీ
 జగిత్యాల ప్రాంతంలో సోయాబీన్ 20 శాతం వరకు ఎండిపోగా, హుస్నాబాద్ ప్రాంతంలో 5వేల హెక్టార్లలో మొక్కజొన్న ఎండుదశకు చేరినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ప్రత్నామ్నాయంగా రబీ పంటలు వేసుకునేలా వ్యవసాయ శాఖ చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తేలిక నేలల్లో ఆముదం, పొద్దుతిరుగుడు, గోరు చిక్కుడు, సజ్జ, రాగి, ఉలవలు, కూరగాయలు సాగు చేసుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బరువు నేలల్లో పొద్దుతిరుగుడు, కంది పంటను దగ్గరగా సాళ్లు వేసుకోవాలని పేర్కొంటున్నారు. లేనిపక్షంలో మరికొద్ది రోజులు ఆగి రబీపంటలో వేరుశనగ, కంది, మొక్కజొన్న లాంటి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. సెప్టెంబర్‌లో రైతులు రబీ పంటలకు సిద్ధమవుతుంటారు. అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళిక రూపొందించింది. రబీ సీజన్‌కు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచింది. 2.30 లక్షల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను.. వర్షాలు ఇదే విధంగా ఉంటే 3 లక్షల హెక్టార్ల వరకు పంటలు సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవే వర్షాలు రబీ సాగు ఆశలను సజీవం చేసే అవకాశాలున్నాయి.
 
 లోటు పూడ్చేనా...?
 ఖరీఫ్ ఆరంభమైన జూన్ మాసం నుంచి ఇప్పటివర కు సాధారణ వర్షపాతం 541.1 మిల్లీమీటర్లకు 416.6 మిల్లీమీటర్లు కురిసింది. సగటున 23 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలోని 57 మండలాల్లో 16 మండాల్లోనే సాధారణ వర్షపాతం నమోదయ్యింది. 36 మండలాల్లో లోటు వర్షం, 2 మండలాల్లో అత్యంత లోటు వర్షం, 3 మండలాల్లోనే అధిక వర్షం కురిసింది. కురుస్తున్న వర్షాలు ఈ లోటును పూడ్చితేనే గండం గట్టెక్కే పరిస్థితులున్నాయి.
 
 సాధారణ వర్షం కురిసిన మండలాలు : కమాన్‌పూర్, మల్హర్, మంథని, మహదేవపూర్, శ్రీరాంపూర్, పెద్దపల్లి, సిరిసిల్ల, వేములవాడ, హుజురాబాద్, సైదాపూర్, ఎల్కతుర్తి, జమ్మికుంట, చొప్పదండి, కరీంనగర్, మానకొండూర్, హుస్నాబాద్
 అధిక వర్షపాతం : కాటారం, కమలాపూర్, వీణవంక
 అత్యంత లోటు : రామడుగు,  కథలాపూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement